ఏపీ ఓటర్ డేటా: ఎవ్వరినీ వదిలేది లేదన్న సీపీ సజ్జనార్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాల లబ్దిదారుల డేటా దుర్వినియోగానికి పాల్పడతున్న వారు ఎంతటివారైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. ఏపీ ఓటర్ల డేటా విషయంలో మార్చి 2న మాదాపూర్ ఐటీ గ్రిడ్ సంస్థ కేంద్రంగా .. తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఏపీ ఓటర్ల తొలగింపు… పబ్లిక్ డేటాను అక్రమంగా  వాడుకున్నారనేందుకు ఆధారాలు దొరికాయని అన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ నలుగురు ఉద్యోగులకు 160 crpc కింద నోటీస్ జారీ చేసి ప్రశ్నించాం అన్నారు. భాస్కర్, ఫణి కుమార్, విక్రమ్ గౌడ్, చంద్ర శేఖర్ ల ఆధ్వర్యంలోనే ఐటీ గ్రిడ్ సంస్థలోని మెటీరియల్ సీజ్ చేశామని చెప్పారు.

“i బాల్,  M క్యాబ్ సిరీస్, మూడు సీపీయూలను సీజ్ చేశాం. AP ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలను IT గ్రిడ్ సంస్థ సేకరించినట్టు ప్రాథమిక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో సంస్థ సీఈఓ అశోక్ ప్రధాన సూత్రధారి. అతడికి కూడా నోటీస్ జారీ చేశాం. అతడు సరెండర్ కావాలి. అవసరమైతే ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తాం. ఓట్ల గల్లంతు వ్యవహారంలో ఇప్పటికే 50 కేసులు నమోదయ్యాయి. తమకు మొదట ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులపై కూడా కేసు నమోదుచేశాం. తగిన చర్యలు తీసుకుంటాం. విలువైన, రహస్యమైన సమాచారం బయటకు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. UIDAI , ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాస్తాం. కొంత డేటాను అమెజాన్ సర్వీస్ ప్రొవైడర్ లో ఉంచారు. అమెజాన్ ను వివరణ కోరుతూ నోటీస్ జారీ చేయబోతున్నాం. ఏపీలో ఓట్ల డేటాతో అక్రమాలకు పాల్పడినవారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదు” అని వివరించారు సజ్జనార్..