బిగ్ బాస్ -3… హోస్ట్ నాగార్జున?

వివాదాలు, విమర్శలు ఎన్నున్నా తెలుగు టెలివిజన్ పై సక్సెస్ ఫుల్ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో మూడో సీజన్ కు సిద్ధమవుతోంది. మూడో సీజన్ లో ఎవరు హోస్ట్​గా చేస్తారని ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బిగ్ బాస్’ షో ప్రేక్షకులకు నచ్చడానికి అందులో పాల్గొనే కంటెస్టెంట్లతో పాటు, హోస్ట్​గా చేసే స్టార్ కూడా ఒక కారణం. పోటీదారులతో కలిసిపోయి, వాళ్లకు సూచనలు, హెచ్చరికలు చేస్తూ షోను నడిపించాల్సి ఉంటుంది. అందుకే సరైన వ్యాఖ్యాత ఉండాలని బిగ్ బాస్ టీం కోరుకుంటోంది. మొదటి సీజన్ కు ‘యంగ్ టైగర్’ ఎన్టీ ఆర్ హోస్ట్​గా చేశాడు. రెండో సీజన్ కు ‘నేచురల్ స్టార్ నాని’ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మూడో సీజన్ హోస్ట్​ కోసం ‘మాటీవీ’ బిగ్ బాస్ బృందం అన్వేషిస్తోంది.

ఎన్టీఆర్.. నాని?
మూడో సీజన్ కోసం కూడా ఎన్టీఆర్, నానిల పేర్లను బిగ్ బాస్ టీమ్ పరిశీలించింది. ఇద్దరినీ సంప్రదించింది. అయితే ఎన్టీఆర్ , నాని దీనిపై ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు . రాజమౌళి సినిమా అంటే అది పూర్తయ్యే వరకు హీరోలకు వేరే కమిట్ మెంట్స్​ఉండవు. పూర్తిగా సినిమాకే సమయం కేటాయించాల్సి ఉంటుంది. దీంతో బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ డేట్ లు కేటాయించలేని పరిస్థితి. అందుకే ఎన్టీఆర్ దీనిపై అంత ఆసక్తి చూపలేదు. రెండో సీజన్ ను హోస్ట్​ చేసిన నాని పేరును కూడా పరిశీలించారు. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాల కారణంగా నాని కూడా షో చేయడంలేదని సమాచారం. ఎన్టీఆర్, నాని బిగ్ బాస్ చేసే అవకాశం లేకపోవడంతో మరో స్టార్ కోసం టీం వెతికింది. విక్టరీ వెంకటేశ్ ను కూడా సంప్రదించినప్పటికీ, వెంకీ కూడా దీనిపై ఆసక్తి చూపలేదు. దీంతో ఇప్పుడు అక్కినేని నాగార్జున పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

నాగ్.. చేస్తారా?
మూడో బిగ్ బాస్ సీజన్ కోసం అక్కినేని నాగార్జున పేరును పరిశీలిస్తోంది టీం. గతంలో నాగార్జున మాటీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అప్పట్లో ఈ షో విజయం సాధించింది. హోస్ట్ గా నాగార్జునకు కూడా మంచి పేరొచ్చింది. టెలివిజన్ వ్యాఖ్యాతగా చేసిన అనుభవం ఉండటంతో నాగార్జున అయితే ‘బిగ్ బాస్ 3’ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తాడని మాటీవీ అనుకుంటోంది. ఎందుకంటే త్వరలోనే నాగార్జున హీరోగా రెండు సినిమాలు ప్రారంభం కానున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘బంగార్రాజు’కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్న నేపథ్యంలో నాగ్ షో చేసేందుకు ఆసక్తి చూపుతాడో లేదా అన్నది చూడాలి.

Latest Updates