
వాషింగ్టన్: సూర్యుడి నుంచి వస్తున్న సౌర తుఫానుల కారణంగా ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్లు భూమిపై పడిపోతున్నాయి. కక్ష్యలో ఉన్న ఇతర శాటిలైట్లు కూడా భూమిపై పడిపోతున్నాయి. కాగా.. ప్రతి 11 ఏండ్లకు ఒకసారి సోలార్ సైకిల్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ 11 ఏండ్లపాటు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం 25వ సోలార్ సైకిల్ లో ఉన్నాం.
సోలార్ సైకిల్ పూర్తయ్యే ముందు సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో భారీగా ఫ్లక్చుయేషన్లు జరుగుతాయి. ఈ క్రమంలో సూర్యుడి నుంచి అంతరిక్షంలోకి భారీఎత్తున సౌర తుఫానులు విడుదలవుతాయి. ఈ సౌర తుఫానుల కారణంగా అంతరిక్షంలో తిరుగుతున్న శాటిలైట్లు పడిపోతున్నాయని నాసా గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ లో స్పేస్ ఫిజిసిస్ట్ గా పనిచేస్తున్న డెన్నీ ఒలివేరా తెలిపారు.
2020 నుంచి 2024 మధ్య భూమిపై పడిపోయిన 523 స్టార్ లింక్ ఉపగ్రహాలపై అధ్యయనం చేసిన టీమ్ కు ఆయన నేతృత్వం వహించారు. సూర్యుడి నుంచి వచ్చే జియోమాగ్నటిక్ తుఫానుల వల్ల స్పేస్ లో కక్ష్యలో తిరుగుతున్న శాటిలైట్లపై ప్రభావం పడి అనుకున్న దాని కన్నా వేగంగా అవి భూమిపై పడిపోతున్నట్లు గుర్తించామని ఆ బృందం కనుగొంది.