అంతా ప్రశాంతం : ప్రత్యేక హోదాపై ఏపీ బంద్

ap-statusప్రత్యేక హోదా, బడ్జెట్ పై కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ గురువారం (ఫిబ్రవరి 8) బంద్ పాటిస్తోంది ఆంద్రప్రదేశ్. వామపక్షాల పిలుపునకు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్‌, జనసేన పార్టీలతో సహా పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. జగన్ పాదయాత్రకు  బ్రేక్ ఇచ్చి.. బంద్ లో పాల్గొన్నారు.  ఉత్తరాంధ్ర చర్చా వేదిక, రాయలసీమ ప్రజా సమితి, ముస్లిం ఐక్యవేదికలు బంద్ కు మద్దతు ప్రకటించాయి.

ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాకి దిగారు నిరసనకారులు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. స్టూడెంట్స్ యూనియన్స్ SFI, AISF మద్దతుతో క్లాసులు బహిష్కరించారు విద్యార్థులు. ముందస్తుగా ఏపీలో స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు బంద్ కు మద్దతు ఇస్తుండటంతో.. ప్రైవేట్ స్కూల్స్ కు సెలవు ప్రకటించారు.

లారీ ఓనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జాతీయ రహదారులపై లారీలను అడ్డుకున్నాయి. వివిధ జిల్లాల్లో తిరుగుతున్న వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించనుంది.

ముఖ్యంగా ఆస్పత్రులు, ఫార్మా మందుల షాపులు, పాల లారీలు, నిత్యావసర సరుకులకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అవి యథావిధిగా పని చేస్తున్నాయి. విపక్షాలకు పోటీగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు.

 

Posted in Uncategorized

Latest Updates