అంతా బోగస్ :  ఒకే ఆఫీసులో 114 కంపెనీలు

ఒకే ఆఫీసులో 114 కంపెనీలతో బోగస్ లావాదేవీలు నడుపుతున్న వారిపై సోదాలు నిర్వహించారు అధికారులు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ లో గల ఓ భవనంలో ఒకే అడ్రస్ పై చిరునామాపై 114 కంపెనీలు కొనసాగుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాలశాఖ అధికారులు బుధవారం(జూలై-25) సోదాలు నిర్వహించారు. డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ డెనింగ్ బాబు ఆధ్వర్యంలోని ఎనిమిది మంది బృందం జరిపిన సోదాల్లో ఈ సూట్‌ కేస్ కంపెనీల బాగోతం బయటపడింది.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని ఫార్చ్యూన్ మోనార్క్ మాల్‌ లో SRSR అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ కొనసాగుతున్నది. బుధవారం అధికారులు సోదాలు నిర్వహించగా 114 కంపెనీలు ఇదే అడ్రస్‌ పై కొనసాగుతున్నట్టు తేలింది. అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించి ఆయా సంస్థల వివరాలను సేకరించారు. ఈ 114 కంపెనీల్లో అత్యధిక శాతం నష్టాల్లో ఉన్నట్టు రికార్డుల్లో కనిపిస్తుండగా.. బ్యాంకు అకౌంట్ల రికార్డుల ఆధారంగా ఆయా కంపెనీలు రూ.కోట్లల్లో లావాదేవీలు జరుపుతున్నట్టు తేలింది. దొరికిన పత్రాల ఆధారంగా భారీగా ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించారు. SRSR అడ్వైజరీ అనేది కేవలం ఆడిటింగ్ సంస్థ అని, కొన్ని సంస్థలకు చెందిన లెక్కలను చూసేందుకు మాత్రమే పరిమితం కావాల్సిన నిర్వాహకులు సూట్‌ కేస్ కంపెనీల ఏర్పాటులో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. బ్లాక్‌ మనీని మార్చుకునేందుకు నగరంలోని పలువురు వ్యక్తులు ఈ బోగస్ కంపెనీలను ఏర్పా టు చేసినట్టు తెలుస్తున్నది.

ఈ బోగస్ కంపెనీల్లో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే డైరెక్టర్లుగా కొనసాగుతున్నట్టు అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో వారిని ప్రశ్నించగా తాము చిన్న ఉద్యోగులమని, డైరెక్టర్లుగా ఉన్న విషయం తెలియదని చెప్పారు. దీంతో అధికారులు వారి అకౌంట్లను పరిశీలించారు. నిర్వాహకులు ఉద్యోగుల ఆకౌంట్ల ద్వారా జీతాల పేరుతో భారీగా లావాదేవీలు జరుపుతున్నట్టు గుర్తించారు. ఒక్కో ఉద్యోగి పేరును 20-30 కంపెనీల్లో డైరెక్టర్లుగా చేర్చినట్టు తెలిసింది. ఈ మేరకు పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates