అందరికీ ఇళ్లు: ప్రాధాన్యత రంగ రుణంగా హోం లోన్

home-loanసొంత ఇళ్లు అనేది ఓ కల… అది సాకారం చేసుకునేందుకు కొనుగోలు దారులకు సంబంధించి రుణ  సౌలభ్యం కోసం ప్రాధాన్యతా పరిధి విస్తరణ లక్ష్యంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) మంగళవారం(జూన్-19) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అందుబాటు ధరల్లో లభించే గృహాల కొనుగోలుదారులకు మరింత లబ్ధి చేకూరనుంది. ప్రాధాన్య రంగ రుణంగా (ప్రయార్టీ సెక్టార్ లెండింగ్(PSL) పరిగణిస్తూ చౌకగా అందించే హోమ్‌లోన్‌ పరిమితిని మరింత పెంచారు. మెట్రో నగరాల్లో..10లక్షల కంటే అధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో ఈ విభాగానికిచ్చే రుణ పరిమితిని రూ.28 లక్షల నుంచి రూ.35 లక్షలకు, ఇతర ప్రాంతాల్లో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది. అందుబాటు గృహాల గరిష్ట ఖరీదు మెట్రో ప్రాంతాలైతే రూ.45 లక్షలు, ఇతర ప్రాంతాలైతే రూ.30 లక్షలకు మించకూడదని RBI తెలిపింది. ఇంతవరకు ఈ పరిమితి మెట్రో నగరాల్లో రూ.35 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.25 లక్షలుగా ఉండేది. ఆర్థికంగా బలహీన వర్గాలు (ఇడబ్ల్యుఎస్‌), అల్పాదాయ వర్గాల (ఎల్‌ఐజి) కోసం నిర్మించే ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి ప్రస్తుతం వర్తించే రూ.2 లక్షల గరిష్ట ఆదాయ పరిమితిని కూడా సవరించారు. ఇడబ్ల్యుఎస్‌ విభాగానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.3 లక్షలకు, ఎల్‌ఐజి విషయంలో రూ.6 లక్షలకు పెంచారు.

RBI తాజా నిర్ణయం అందుబాటు గృహాల విభాగానికి ఊతమివ్వనుందని విశ్లేషకులు అంటున్నారు. చౌకగా లభించే హోమ్‌లోన్‌ పరిమితిని పెంచడంతో మరింత మంది ఈ విభాగ గృహాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates