అందరి ఆశీస్సులుంటే 2019లో ప్రభుత్వ ఏర్పాటు: పవన్

pkయువత మద్దతు, పెద్దల ఆశీస్సులుంటే 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగతా పార్టీల మాదిరిగా కులాలను విడదీసి పబ్బం గడపనన్నారు. ప్రజాసేవే మా పార్టీ సిద్ధాంతమన్నారు. తానెప్పుడూ పదవులు కోరుకోలేదని, పని చేయడానికే ఇష్టపడతానన్నారు. తన పర్యటన సమస్యలను అవగాహన చేసుకునేందుకేనన్నారు.

రాత్రి ఇచ్ఛాపురంలోనే ఉన్న పవన్ ఇవాళ ఉదయం కవిటి మండలం కపస కుర్ది దగ్గర సముద్ర తీరంలో గంగ పూజలు చేశారు. స్థానిక మత్స్యకారులతో కలిసి గంగా స్నానం చేశారు. అక్కడి నుంచి పోరాట యాత్ర మొదలుపెట్టారు. ఇచ్ఛాపురంలో స్వేచ్ఛవతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  మధ్యాహ్నం జనసేన నిరసన కవాతు నిర్వహించనుంది. 3 గంటలకు స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగసభకు మాట్లాడనున్నారు పవన్ కల్యాణ్ . అక్కడి నుంచి కవిటి మండలంలో పోరాట యాత్ర సాగనుంది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి మొదలైన యాత్ర తొలి విడతలో 45 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్. బస్సు యాత్ర చేపడతారని మొదట అనుకున్నా…. తర్వాత పోరాటయాత్రగా ప్రకటించారు. ప్రధానంగా సమస్యలపై దృష్టి పెట్టనున్నారు. జనం సమస్యలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో నియోజకవర్గ కేంద్రాల్లో కవాతులతో పాటు రోడ్డు షోలకు ప్లాన్ చేసింది జనసేన. జిల్లా పర్యటన ముగిసే రోజు జిల్లా కేంద్రంలో సభలు, జన సమీకరణ చేయనున్నారు. మూడు జిల్లాల్లో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మీటింగుల్లో ప్రస్తావించనున్నారు పవన్.

యాత్రలో గ్రామాల్లోని కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాల్లోనే రాత్రి బస చేయనున్నారు పవన్. యాత్ర మధ్యలోనే పార్టీలోకి నాయకుల చేరికలు ఉంటాయని చెప్తున్నారు జనసేన నేతలు. పవన్  యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్సును సిద్ధం చేస్తున్నా అది శ్రీకాకుళం జిల్లా వచ్చేవరకు టైమ్ పడుతుందని చెప్తున్నారు నేతలు.

 

Posted in Uncategorized

Latest Updates