అందులో నిజం లేదు: సీఎం సీటు పంపకంపై ఒప్పందం జరగలేదు

KUముఖ్యమంత్రి సీటు పై స్పందించారు JDS నేత HD కుమార స్వామి. సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని… దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కర్ణాటక సీఎంగా బుధవారం(మే-23) ప్రమాణస్వీకారం చేయనున్న కుమారస్వామి..ఇవాళ(సోమవారం,మే-21) ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమై మంత్రిమండలి కూర్పుపై చర్చించనున్నారు. కేబినెట్‌ విస్తరణతోపాటుగా ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తామన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని ఆయన తెలిపారు.

కుమారస్వామితోపాటుగా సిద్దరామయ్య, జి. పరమేశ్వరన్, డీకే శివకుమార్‌లుకూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం(మే-20) కాంగ్రెస్‌ నేతలతో కుమారస్వామి భేటీ అయ్యారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. అయితే డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్‌ నుంచి దళిత నేతను ఎన్నుకోవటం దాదాపు ఖాయమైంది. అది పీసీసీ చీఫ్‌ జి. పరమేశ్వరే అని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ బలం ఆధారంగా.. 34 మంత్రులను ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, జేడీఎస్, కాంగ్రెస్‌ మధ్య కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం జేడీఎస్‌ సీఎం, 13 కేబినెట్‌ బెర్తులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం సహా 20 కేబినెట్‌ బెర్తులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి తన దగ్గరే ఆర్థిక శాఖను అంటిపెట్టుకోవచ్చని సమాచారం. డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరన్‌ ఎంపిక దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలను కాపాడటంతో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు కీలక శాఖను అప్పజెప్పాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

కర్ణాటకకు కాబోయే సీఎం కుమారస్వామి మంత్రివర్గంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా పరమేశ్వరతో పాటు జేడీఎస్‌ నుంచి కూడా మరో  డిప్యూటీ సీఎం ఉండొచ్చని సమాచారం. మరోవైపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే కుమారస్వామి బలనిరూపణ చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూరు శివార్లలోని రిసార్టులోనే ఉన్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం సోమవారం కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ.. జేడీఎస్‌ బుధవారానికి వాయిదా వేసింది. సోమవారం (మే 21) మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 27వ వర్ధంతి కారణంగా దీన్ని రెండు రోజులు వెనక్కు జరిపారు. మొదట కంఠీరవ స్టేడియంలోప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించినప్పటికీ.. దీన్ని విధానసౌధకే మార్చే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates