అంపన్‌ తుఫాను: రాష్ట్రాలను ఆదుకుంటామన్న అమిత్‌ షా

బెంగాల్‌, ఒడిశా సీఎంలకు ఫోన్‌

న్యూఢిల్లీ: అంపన్‌ తుఫాను ముంచుకొస్తున్న వేళ కేంద్ర మంత్రి అమిత్‌ షా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఫ్లోన్‌లో మాట్లాడారు. తుఫానుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కాగా.. అంపన్‌ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండటంతో బుధవారం వరకు చేపల వేటను నిషేధించారు. పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా మారిన అంపన్‌ తుపాను ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 570 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్‌లోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. బుధవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్,‌ బంగ్లాదేశ్‌ తీరంలో హతియా ఐలాండ్ దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. తుఫాను కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని చెప్పారు. సముద్రంలో అలలు కూడా భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లోని గుడిసెలు, ఇళ్లు, రోడ్లు అన్ని దెబ్బతిన్నాయి.

Latest Updates