అక్కడ గాంధీ ఒక దేవుడు.. గుడిలో ఏటేటా పూజలు

నల్గొండ : ఊరూరా విగ్రహాలే కాదు… దేశం గుండెల్లో నిలిచిపోయిన మహాత్ముడికి మందిరం ఉంది. అక్కడ మహాత్ముడు నిత్య పూజలందుకుంటాడు. ప్రతిరోజు జనంలో స్ఫూర్తి నింపుతాడు. ఏకాగ్రత, ధ్యానంపై సందేశం ఇస్తుంటాడు. ఏటేటా వైభవంగా జయంతి ఉత్సవం జరుపుకుంటాడు. తాము కోరిన కోరికలు కూడా తీరుస్తాడు ఈ మహాత్మడు అని భక్తులు చెబుతుంటారు.

మహాత్ముడి గుడి చూడాలంటే… నల్గొండ జిల్లా పిడకపర్తి గ్రామానికి వెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఈ గుడి దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాలమైన ప్రాంగణంలో.. ప్రశాంతమైన ప్రదేశంలో నాలుగు ఎకరాల్లో గాంధీ గుడి నిర్మించారు. ఆరుగురు స్నేహితులు ఒక ట్రస్ట్ గా ఏర్పడి… తమ పెట్టుబడికి.. జిల్లా ప్రజలు, ఊరి ప్రజల విరాళాలు జోడించి.. 2014లో జాతిపితకు ప్రత్యేకమైన గుడి కట్టారు.

పూజారి రోజూ వచ్చి నిత్య పూజలు చేస్తుంటారు. భగవంతుడికి చేసే అన్నిరకాల పూజలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. గాంధీజీ జీవితం, స్వతంత్ర సంగ్రామంలోని ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ స్పెషల్ పూజలు చేస్తారు. గాంధీ జయంతి రోజున స్కూలు, కాలేజీ పిల్లలకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. భక్తుల విరాళాలు, ఆలయంలో కానుకలతో మహాత్ముడి గుడిని అభివృద్ధి చేస్తున్నారు. పూజారికి అందులోనుంచే జీతం అందిస్తున్నారు.

ఈ గుడిని రెండు అంతస్తుల్లో నిర్మించారు. మొదటి అంతస్తులో మహాత్ముడి గుడి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో గాంధీజీ విగ్రహం, లైబ్రరీ ఉన్నాయి. పరమత సహనాన్ని బోధించిన మహాత్ముడికి గుర్తుగా.. లైబ్రరీలో గాంధీ బోధనలు, అన్ని మతాల పవిత్రగ్రంథాలు, పుణ్య పురుషుల జీవిత చరిత్రలు, ఏకాగ్రత అంశాలపై పుస్తకాలు ఉన్నాయి.  ధ్యానం చేసేందుకు ఉదయం, సాయంత్రం వేలల్లో భక్తులు వస్తుంటారు.

Posted in Uncategorized

Latest Updates