అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా : తిరుమల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

USTAVతిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో, అక్టోబర్లో ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు దేవస్థానం జేఈవో. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. కొలిచిన వారి కొంగు బంగారు. ఆపద మొక్కులవాడు అనాధ రక్షకుడు. ఇలా ఏ పేరుతో పిలిచినా… పలికే దేవదేవుడు. తిరుమల కొండపై నిత్యం భక్త జనం సందోహమే. రోజువారీ పూజలతో పాటు…. ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారికి ఉత్సవాలు చేయడం ఆనవాయితీ.ఏటా తిరుమల వెంకన్నకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది టీటీడీ. అలాగే ఈ ఏడాది శ్రీవారికి రెండుసార్లు జరగనున్న బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తుంది దేవస్థానం. తిరుమల అన్నమయ్య భవనంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు టీటీడీ జేఈవో. సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు…. అలాగే అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహిస్తామని తెలిపారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భముగా రాష్ర్ట ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆగష్టు చివరి వరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు అధికారులు. భక్తులకు ఇబ్బంది లేకుండా గ్యాలరీలను పూర్తి స్థాయిలో విస్తరిస్తామన్నారు. ఆగష్టు 26 న జరిగే పౌర్ణమి గరుడ సేవను బ్రహ్మోత్సవాల ట్రయల్ గా నిర్వహిస్తామన్నారు జేఈఓ. ఆగస్టు 12 నుండి 16 వరకు మహా సంప్రోక్షణం , బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని జూలై 10 నుంచి ఆగస్టు 10 వరకు రిపేర్ల కోసం పుష్కరిణి మూసివేస్తామన్నారు జేఈవో. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు వసతులు కల్పించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భముగా వాహనసేవలు ఉదయం 9 గంటలకు, రాత్రి 8 గంటలకు ప్రారంభిస్తామన్నారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 13 న ధ్వజారోహణం, 17 న గరుడ సేవ, 18 న స్వర్ణ రథం, 20 న రధోత్సవం, 21 న చక్రస్నానం, ధ్వజాఅవరోహణం ఉంటుందన్నారు అధికారులు. అక్టోబర్లో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 14 గరుడ వాహనం,17 న స్వర్ణరధం, 18 న స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తున్నామన్నారు.

Latest Updates