అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్న పెద్ద పులి

కొమురంభీం జిల్లా: ఇద్దరు గిరిజనులను పొట్టన పెట్టుకున్న ఏ2 పెద్ద పులి అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. బెజ్జూరు మండలం, కంది భీమన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తోన్న పులి.. అటవీ ప్రాంతంలో అధికారుల హడావుడి, వాహనాల రాకపోకలు పెరిగిపోవడంతో అప్రమత్తమైంది. పగటిపూట పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ సూర్యాస్తసమయం తర్వాత రాత్రి వేళల్లోనే సంచరిస్తోంది. అటవీశాఖ ఎరకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతోంది.

ఆరు రోజులుగా సాగుతున్న ఆపరేషన్ టైగర్‌ లో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. ఆపరేషన్‌ లో భాగంగా కందిభీమన్న అటవీ ప్రాంతంలో టైగర్ ట్రాక్టర్లు, రిక్క్యూ బృందాలు, మహారాష్ట్ర నిపుణులు, డాక్టర్లు సహా 150 మంది అటవీశాఖ అధికారులు తిష్టవేశారు. పులిని బంధించేందుకు అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లతో అటవీ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఎత్తైన మంచిలపై మకాం పెట్టి పులి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పులి రాత్రి వేళల్లో సంచరిస్తుండడం.. అధికారులకు తలనొప్పిగా మారుతోంది. రాత్రి పూట పులిపై మత్తుమందు ప్రయోగానికి నిబంధనలు అడ్డొస్తున్నాయి.  ఒక వేళ ప్రయోగం చేసినా చీకట్లో బంధించడం ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

Latest Updates