చిన్నారి ప్రాణాలకు రక్షణేది?

‘ఢిల్లీలో ఓ రోజు రాత్రంతా జోరుగా వర్షం పడింది. తెల్లారిన తర్వాత ఓ చోట నీటి మడుగులో రెండు రోజుల శిశువు పడి ఉంది. ఓ ఎన్జీవో కార్యకర్తలు ఆ శిశువును తీసుకెళ్లారు. కానీ.. తీవ్రమైన న్యూమొనియాతో రెండు గంటల్లోనే ఆ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది’ దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో ఇలా స్పెషలైజ్డ్ చైల్డ్ అడాప్షన్ సెంటర్లకు చేరినప్పటికీ.. 776 మంది పిల్లలు చనిపోయారట!  ‘వాళ్లందరూ ఆరేళ్లలోపు అనాథ పిల్లలు. తల్లిదండ్రులు లేనోళ్లు. ఉన్నా.. వదిలేసినోళ్లు. అందరూ పిల్లల సంరక్షణలో స్పెషలైజ్డ్ అయిన చైల్డ్ అడాప్షన్ సెంటర్లలోనే ఉంటున్నారు. అయినా.. డయేరియా, శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లకు బలి అయిపోతున్నారు’ అని సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ (కారా) వెల్లడించింది. అలాగే చాలా మంది పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికే తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉండటం వల్ల కూడా కాపాడేందుకు కష్టమవుతోందని చెప్పింది. నెలలు నిండకుండానే పుట్టడం, జనన సంబంధ సమస్యల వల్ల కూడా కొందరు మరణించారని పేర్కొంది.  దేశవ్యాప్తంగా 434  స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు ఉండగా, వాటిలో 355 సెంటర్లను ఎన్జీఓలు, 79 సెంటర్లను స్టేట్ గవర్నమెంట్లు నడుపుతున్నాయని చెప్పింది. ‘పీటీఐ’ ఆర్టీఐ అప్లికేషన్ కు కారా ఈ వివరాలతో సమాధానమిచ్చింది. దీని ప్రకారం, ఏప్రిల్ 2016 నుంచి ఈ ఏడాది జూలై మధ్య యూపీలోని సెంటర్లలో అత్యధికంగా 124 మంది పిల్లలు చనిపోయారట. ఆ తర్వాత బిహార్లో 107 మంది, మహారాష్ట్రలో 81 మంది మరణించారట. అయితే, వీటిలో దాదాపు 7,074 మంది పిల్లలు ఉండగా, మూడేళ్లలో 776 మంది అంటే 10 శాతం మంది చనిపోవడం విషాదకరమని అధికారులు చెబుతున్నారు. పిల్లలు వచ్చేటప్పటికే హెల్త్ కండిషన్స్ బాగా లేకపోవడమూ మరణాలకు కారణమవుతోందని అంటున్నారు.

Latest Updates