అడియాలా జైలుకు షరీష్,మరియం

అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం శుక్రవారం(జూలై-13) అరెస్టయ్యారు. లండన్ నుంచి బయల్దేరి స్వదేశానికి చేరుకున్న వారిని లాహోర్ ఎయిర్ పోర్టులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(NAB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రావల్పిండిలోని అడియాలా జైలుకు షరీఫ్‌ను,మరియం తరలించారు. అడియాలా జైలు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మరియంను సిహాలా రెస్ట్‌ హౌస్‌ సబ్‌జైలుకు తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇద్దరికీ జైల్లో బీ క్లాస్‌ సదుపాయాలు కల్పించినట్లు పాక్ మీడియా తెలిపింది.

పనామా పేపర్ల కుంభకోణంలో మూడవ అనుబంధ కేసు అయిన ఈవెన్‌ఫీల్డ్ ఆస్తుల కేసులో నేషనల్ అకౌంటబిలిటీ కోర్టు గతవారం నవాజ్ షరీఫ్ (68), ఆయన కుమార్తె మరియం (44), అల్లుడు సఫ్దర్‌లను దోషులుగా తేల్చుతూ జైలుశిక్ష, జరిమానా విధించింది. కోర్టు తీర్పునిచ్చిన సమయంలో లండన్‌లో ఉన్న తండ్రీకూతురు శుక్రవారం స్వదేశంలో అడుగుపెట్టగానే అరెస్టులు జరిగాయి. అంతకుముందు లండన్ నుంచి లాహోర్ వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

శుక్రవారం(జులై-13) అబుదాబీ మీదుగా వారు ఇత్తెహాద్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో మూడుగంటలు ఆలస్యంగా రాత్రి 9.15 గంటలకు లాహోర్ చేరుకున్నారు. ముగ్గురు సభ్యుల ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) టీం విమానంలోకి ప్రవేశించి షరీఫ్, మరియంల పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకుంది. విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న షరీఫ్ తల్లి బేగం షమీమ్ అఖ్తర్, సోదరుడి కుమారుడు సల్మాన్‌లతో మాట్లాడేందుకు అధికారులు వారిని అనుమతించారు. తర్వాత తండ్రీకూతుళ్లను ఎఫ్‌ఐఏ అధికారులు ఆర్థికనేరాలను విచారించే ఎన్‌ఏబీ బృందానికి అప్పగించగా, వారు భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక హెలికాప్టర్‌లో రావల్పిండికి తరలించారు.

షరీఫ్ అరెస్టుతో లాహోర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. షరీఫ్‌కు మద్దతుగా పాకిస్తాన్ ముస్లింలీగ్ (PML) కు చెందిన వేలాదిమంది కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారులన్నీ దిగ్బంధించారు. లాహోర్‌లో 144వ సెక్షన్‌ను విధించిన పోలీసులు, 10వేలమందితో బందోబస్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates