అడ్డుకున్నా ఆగలేదు : నీతి ఆయోగ్ లో బాబు ఓవర్ టైం స్పీచ్

BUCనీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం ఆసక్తికరంగా మారింది. విభజన హామీలు, స్పెషల్ స్టేటస్ అంశం, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చే అంశం, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్ లాంటి అంశాలను వివరించారు. వీటితోపాటు నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వైఫల్యాలను ప్రస్తావించారు  చంద్రబాబు. ఎన్డీయే నుంచి బయటకొచ్చిన చంద్రబాబు.. తొలిసారి నీతి ఆయోగ్ ని వేదికగా చేసుకుని ప్రధాని మోడీపై విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించిన చంద్రబాబు.. 13 పేజీల పాఠాన్ని 35 అంశాలుగా.. చదివి వినిపించారు. విభజన సందర్భంగా ఏపీ నష్టపోయిందని.. అందుకే తన ప్రసంగాన్ని ప్రత్యేకంగా చూడాలని కోరారు. రాష్ట్ర విభజనను ఏపీ కోరుకోలేదని.. అయినా సహించామని.. కేంద్రం మోసం చేసిన తీరు బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారన్న బాబు… రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని.. రెవిన్యూ లోటును భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నంత సేపు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అడ్డుతగులుతూ వచ్చారు. నిజానికి ఒక్కో సీఎంకు 7 నిమిషాలు మాత్రమే ప్రసంగించే అవకాశమిచ్చారు. సమయం మించిపోతోందని రాజ్ నాథ్.. చంద్రబాబుకు అడ్డుతగులుతూ వచ్చారు. ముఖ్యంగా నోట్లరద్దు, జీఎస్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నప్పుడు రాజ్ నాథ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

సీఎం చంద్రబాబుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ మద్ధతు నిలిచారు. ఏపీకి న్యాయం చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీక్షపై స్పందించిన దీదీ.. వెంటనే దానిపై కేంద్రం ఏదో ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates