అద్దెగర్భాల ప్రక్రియకు అడ్డుకట్ట

హైదరాబాద్ : పద్ధతి లేకుండా అడ్డగోలుగా కొనసాగుతున్న అద్దెగర్భాల (సరోగసీ) ప్రక్రియను అడ్డుకోవాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అద్దెగర్భాల వ్యాపారాన్ని నిషేధిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. దీంతో అద్దెగర్భాల ప్రక్రియపై దృష్టి పెట్టింది రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో విచ్చలవిడిగా అద్దెగర్భాల ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాదిన్నర కిందట హైదరాబాద్‌, భువనగిరిల్లోని రెండు ఆసుపత్రుల్లోనే దాదాపు 100 మందికి పైగా మహిళలు వేరే వారి సంతానాన్ని తమ కడుపులో మోస్తున్నట్లు గుర్తించారు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు. వీరిలో అత్యధిక మంది నిరుపేదలేనని, డబ్బు కోసమే అద్దె గర్భధారణకు సిద్ధపడ్డారని తేలింది. ఈ వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లింది.

కరీంనగర్‌, వరంగల్‌ వంటి చోట్లా ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతుంది. పెళ్లికాని యువతులు కూడా డబ్బు కోసం గర్భాన్ని అద్దెకిచ్చేందుకు ముందుకొస్తున్నారు. సాధారణంగా భార్యాభర్తల నుంచి సేకరించిన అండం, వీర్యకణాలను ట్యూబ్‌లో ప్రవేశపెట్టి ఫలదీకరణ అనంతరం అద్దెగర్భానికి సిద్ధపడిన మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అద్దెగర్భాలకు ప్రత్యేక చట్టం లేకపోవడంతో సంతాన సాఫల్య కేంద్రాల ముసుగులోనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పద్ధతిలో బిడ్డను కనాలనుకునేవారి నుంచి ఆసుపత్రులు సుమారు రూ.12 లక్షల నుంచి 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. దీనిపై బ్రేక్ వేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates