అధికారుల ఆకస్మిక దాడులు : బట్టల దుకాణాలపై 200 కేసులు

హైదరాబాద్ : దసరా పండగ సందర్భంగా వస్త్ర దుకాణాలు నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు అందడంతో తూనికలు కొలతల శాఖ శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 15బృందాలుగా విడిపోయి 60 దుకాణాల్లో తనిఖీలు చేశారు అధికారులు. కొన్ని దుకాణాల్లో దుస్తుల సైజు, ఉత్పత్తిదారుడి వివరాలు, ధర, వినియోగదారుల సహాయ కేంద్రం నెంబరు మొదలైన వివరాలు ముద్రించలేదని తేలిపారు అధికారులు. దుస్తులపై ధరలు మార్చడం, కొన్నిచోట్ల రెండు మీటర్లు ఉండాల్సిన లుంగీలు 190 సెంటీమీటర్లు మాత్రమే ఉండటం, తదితర నిబంధనలు ఉల్లంఘన కింద 200 కేసులు నమోదు చేశారు తూనికలు కొలతల అధికారులు. బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, అమీర్‌పేట, ఎల్‌.బీ.నగర్‌, సికింద్రాబాద్‌, జీడిమెట్ల, కూకట్‌పల్లి, లంగర్‌హౌజ్‌, వనస్థలిపురం, మాసబ్‌ ట్యాంక్‌ ప్రాంతాల్లో అసిస్టెంట్‌ కంట్రోలర్లు భాస్కర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, రాజేశ్వరరావు, విజయసారథి, శివానంద్‌, నిర్మలకుమార్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారులపై వినియోగదారులు వాట్సప్‌ నంబరు:73307 74444, టోల్‌ ఫ్రీ నంబరు: 180042500333కి ఫిర్యాదు చేయాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates