అన్నదాతకు అండగా: నీతిఆయోగ్ లో నివేదించనున్న సీఎం కేసీఆర్

kcrవ్యవసాయరంగ అభివృద్ధి…రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనే ప్రధాన ఎజెండాతో ఢిల్లీలో ఆదివారం (జూన్-17) జరుగనున్న నీతిఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌ఫామింగ్ ఇండియా) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రధాన ఆకర్షణగా నిలువనున్నది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకం, 24 గంటల ఉచిత విద్యుత్ అంశాలు సమావేశంలో ప్రత్యక్షం గా, పరోక్షంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నట్టు అధికారవర్గాలద్వారా తెలిసింది. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆన్‌లైన్ వ్యవసాయ మార్కెటింగ్, ఆరోగ్య సంరక్షణ, ఆయుష్మాన్ భారతి, ప్రధానమంత్రి రాష్ట్రీయ సత్య సురక్ష మిషన్, పోషణ్ మిషన్, మిషన్ ఇంద్రధనుష్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపైనా చర్చ జరుగనున్నది.

కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అధికారులు పాల్గొనే ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ పాల్గొననున్నా రు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర అందించాలనే విషయంపై సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశముందంటున్నారు. ఇప్పటికే గత నెలలో రైతుబంధు పథకం ప్రారంభించి అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది. రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.8వేల చొప్పున ఇస్తున్న పంట పెట్టుబడిసాయం వ్యవసాయరంగంలో కొత్త శకానికి నాందిపలికింది.

రైతుబంధు పథకం కోసం ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయించింది. 24గంటల ఉచితవిద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. త్వరలో ప్రారంభంకానున్న రైతుబీమా పథకం నీతిఆయోగ్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఆగస్టు 15 నుంచి అమలుకానున్న ఉచిత బీమా పథకంలో 18 నుంచి 60 ఏండ్ల లోపు వయసున్న రైతులందరికీ రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల రాబడిని పెంచడానికి ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతంచేయాలని, ట్రేడింగ్‌లో మార్పులు తేవాలని నీతి ఆయోగ్ గతంలో పలుమార్లు చెప్పినా ఒక్క తెలంగాణ తప్ప ఏ ఇతర రాష్ట్రాలు ఇంట్రెస్ట్ చూపలేదని గతంలో నీతి ఆయోగ్ అసంతృప్తిని వ్యక్తంచేసింది. కానీ తెలంగాణలో ఇప్పటికే 48 మార్కెట్ యార్డుల్లో ఆన్‌లైన్ విధానం ఈ-నామ్‌ను అమలుచేసి అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. దీనిపై నీతి ఆయోగ్‌లో చర్చ జరుగనున్నది.

మరో నాలుగేళ్లలో (2022 నాటికి) రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటూ కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరేందుకు నీతిఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కోరనుంది. ఆదివారం ఢిల్లీలో జరుగనున్న నీతిఆయోగ్ నాలుగో పాలక మండలి సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదించనుంది. ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు కేంద్రం రాష్ట్రాల మద్దతును కోరనుంది. ఈ పథకం కింద దేశంలోని 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పించనున్నారు. శిశువులకు, తల్లులకు రోగ నిరోధక టీకాలు ఇచ్చే మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమ విస్తరణ అంశం సమావేశం ఎజెండాలో ఉంటుందని నీతిఆయోగ్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. వచ్చేఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించబోయే కార్యక్రమాల గురించి చర్చిస్తారని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates