అన్నదాతను ఆదుకోండి.. రైతుల పాడె మోస్తూ నిరసన

ఏపీ : రాయలసీమలో కరవుతో దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటలపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం.. వామపక్ష సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ (అక్టోబర్-15) రైతుల పాడె కట్టి, కర్నూల్ కొత్త బస్టాండు నుండి కలెక్టరేట్ వరకు ఊరేగింపు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట 37 మంది రైతుల పాడే లను దించి నిరసన నినాదాలు చేశారు. కలెక్టరేట్ ను దిగ్బంధించి కొద్దిసేపు ధర్నా చేశారు.

ఈ ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు కురవక.. పంట పెట్టుబడి నష్టపోయి అప్పులపాలైన రైతులు దిక్కుతోచక 37 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరవు పరిస్థితిని గుర్తించి ఏపీ ప్రభుత్వం 315 మండలాలను కరవు మండలాలను ప్రకటించినా.. ఆచరణలో ఎక్కడా ఆదుకునే చర్యలు కనిపించకపోవడంతో.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకుల సహకారంతో.. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో కలసి వినూత్న నిరసన చేపట్టారు. కనీసం సాగు చేసుకునే వారికైనా కాలువల ద్వారా నీళ్లివ్వాలని.. పంటల సాగుకు నీటి భద్రత కల్పలించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. రైతుల పొలాలకు నీళ్లివ్వడం లేదని సీరియస్ అయ్యారు రైతులు. పైపు లైన్లు వేసి కాలువల నుండి మెట్ట ప్రాంతాలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరితే..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు తెలిపారు.  ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు అన్నదాతలు.

Posted in Uncategorized

Latest Updates