అన్ని జిల్లాల్లో JEE, నీట్ శిక్షణ

ఇంజినీరింగ్‌, మెడిసిన్ ఎంట్రెన్స్ పరీక్షలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకేంద్రంలో ఒక చోట సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(COE)ను ఏర్పాటు చేస్తుంది విద్యాశాఖ. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రెండో సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను ఒక్కో గ్రూపు నుంచి 30 మంది చొప్పున ఎంపిక చేసి ఎంసెట్‌, JEEకి.. నీట్‌, ఎయిమ్స్‌, ఎంసెట్‌ అగ్రికల్చర్‌ లాంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు శిక్షణ ఇస్తామని తెలిపారు ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌, బోర్డు కార్యదర్శి ఎ.అశోక్‌. ఇంటర్‌ ఫస్ట్ ఈయర్ లో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. బాలురు, బాలికలకు కలిపే శిక్షణ ఇస్తామని, వసతిగృహాలు వేరుగా ఉంటాయన్నారు. జూనియర్‌ కాలేజీల్లో 1,200 అతిథి అధ్యాపకులను నియమిస్తున్నామని, కాంట్రాక్ట్ టీచర్స్ మాదిరిగా గతంలో పనిచేసిన వారినే కొనసాగించడం వీలుకాదని తెలిపారు అశోక్‌. ఈ ఏడాది ఇప్పటివరకు జూనియర్‌ జనరల్‌, ఒకేషనల్‌ ఇంటర్‌ కళాశాలల్లో 92,448 మంది ప్రవేశాలు పొందారని, ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అన్నారు. 15 మీటర్ల కంటే ఎత్తున్న భవనాల్లో ఉన్న 63 ప్రైవేటు కళాశాలలకు అగ్నిమాపకశాఖ ( NOC) ఇచ్చేందుకు నిరాకరించినందున వాటిని ఇతర భవనాల్లోకి మార్చుకోవాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశామని తెలిపారు. తుది గడువు ఎప్పుడని ప్రశ్నించగా.. సాధ్యమైనంత త్వరగా అగ్నిమాపక రక్షణ చర్యలు ఉన్న భవనాలకు తరలించాలని ఆదేశించామన్నారు. ఇప్పటివరకు 20 కళాశాలలు మాత్రమే వసతిగృహాల అనుమతికి దరఖాస్తు చేశాయని తెలిపారు. దరఖాస్తు గడువు జులై 31తో ముగుస్తుందని, త్వరలో సమావేశం నిర్వహించి అనుమతి తీసుకోని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Posted in Uncategorized

Latest Updates