అన్నీ గొప్పలు చెప్పుకోవటమే : 4G స్పీడ్ లో మనం లాస్ట్

G4ప్రపంచంలోనే 4G ఓ సంచలనం. అయితే ఈ 4G స్పీడులో ప్రపంచంలోనే చివరి స్ధానంలో ఉంది భారత్. మనకంటే మన పక్క దేశాలు ముందు వరసలో ఉన్నాయి.  వైర్‌లెస్‌ కవరేజీని మ్యాపింగ్‌ చేసే బ్రిటన్‌ సంస్థ ‘ఓపెన్‌ సిగ్నల్‌’ మొత్తం 88 దేశాల్లో 4జీ ఎల్‌టీఈ స్పీడ్‌కు సంబంధించిన ఫిబ్రవరి నెల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం..

భారత్ “స్లో G” గా చివరి నుంచి మొదటి స్తానంలో నిలిచింది. భారత్‌లో సగటు డౌన్‌లోడ్‌ స్పీడు 6.07 mbps (మెగాబైట్స్‌ పర్‌ సెకండ్‌) గా ఉంది. మన పొరుగు దేశాలు పాకిస్తాన్‌లో ఈ వేగం మన కంటే డబుల్ 13.56గా ఉంది. శ్రీలంకలో 13.95 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇందులో మొదటి స్థానంలో ఉన్న సింగపూర్‌లో 4G స్పీడు 44 ఎంబీపీఎస్‌గా ఉంది. అయితే స్పీడు విషయంలో భారత్ వెనక వరుసలో ఉన్నప్పటికీ 4G విస్తృతి, లభ్యత విషయంలో మాత్రం 14 స్థానంలో నిలిచింది.

దేశంలో 4G కవరేజీ 86.26 శాతంగా ఉంది. ఈ జాబితాలో దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 96 శాతం 4G కవరేజీ పరిధిలో ఉంది. పాక్‌లో ఇది 66 శాతం, శ్రీలంకలో 45 శాతంగా ఉంది. 4G LTEకి సంబంధించి అడ్వాన్స్‌డ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దేశాలు స్పీడు విషయంలో ముందంజలో ఉన్నాయని ‘ఓపెన్‌ సిగ్నల్‌’ తెలిపింది. అయితే.. దక్షిణ కొరియా, సింగపూర్‌ వంటి చోట్ల మొబైల్‌ టారిఫ్‌ ఎక్కువగా ఉంటుందని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి తక్కువగా ఉండి వేగం విషయంలో స్థిరత్వం ఉందని తెలిపింది. భారత్‌ వంటి దేశాల్లో మొబైల్‌ నెట్‌ వినియోగదారులు ఎక్కువని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో స్పీడు తగ్గుతోందని తెలిపింది. LTE అడ్వాన్స్‌డ్‌ నెట్ వర్క్ ను విస్తృతపరచడమే దీనికి పరిష్కారమని నిపుణులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates