అన్న బిడ్డలదే ప్లాన్ : రిటైర్డ్ IAS హత్యకు కుట్ర

IAS-deadమానవ సంబంధాలు రోజురోజుకి ఎంతలా దిగజారుతున్నాయి అనే దానికి మరో ఉదాహరణ ఇది. సొంత బాబాయ్ నే హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారంటే ఏ స్థాయిలో ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయో అర్థం అవుతుంది. వివరాల్లోకి వెళితే.. పొన్నెకంటి దయాచారి మాజీ ఐఏఎస్ అధికారి. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఈయనకు ఓ అన్నయ్య ఉన్నారు. వారి కుమారుడు పి.కరుణాకర్ (59), కుమార్తె మంజుల (54)తో ఆయనకు బాగా చనువు ఉంది. వరసకు కుమారుడు, కుమార్తె అయిన వీరితో దయాచారి ఆర్థిక లావాదేవీలు చేసేశారు. ఈ క్రమంలోనే రూ.5 కోట్ల విలువైన భూమి విషయంలో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కొన్నాళ్లుగా వివాదం నడుస్తుంది. అయితే దయాచారి ఉన్నంత కాలం ఆ భూమి తమకు దక్కదని భావించారు. ఈ క్రమంలోనే సొంత బాబాయ్ ను చంపాలని కరుణాకర్, మంజుల ప్లాన్ వేశారు.

విజయవాడకి చెందిన తమ బిజినెస్ పార్టనర్ వెంకటేశ్వరరావుతో కలిసి హత్యకు కుట్ర చేశారు. ఈ క్రమంలోనే దయాచారిని చంపటానికి బెజవాడలోని బోను దుర్గా నురేష్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చారు. నరేష్ మరో నలుగురితో కలిసి 3వ తేదీ హైదరాబాద్ వచ్చాడు. దయాచారి కదలికలపై నిఘా పెట్టారు. ఆయన ప్రతి రోజు ఉదం వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వస్తాడని.. రోడ్డుపై నడుస్తారనే విషయాన్ని గుర్తించారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదం 7 గంటలకు ప్రశాసన్ నగర్ లో వాకింగ్ చేస్తున్నారు దయాచారి. దీన్ని గమనించిన నరేశ్.. తనతోపాటు వచ్చిన సాగర్, అశోక్ అనే ఇద్దరు యువకులకు బైక్ ఇచ్చి హత్య చేయాలని చెప్పాడు. వారు దయాచారిని వెంబడించారు. ఇంటి నుంచి కొద్దిదూరం వెళ్లిన తర్వాత.. బైక్ వెనకాల కూర్చున్న అశోక్.. దయాచారి తలపై క్రికెట్ వికెట్ తో బలంగా కొట్టాడు. ఆయన కుప్పకూలిపోయాడు. చనిపోయాడని భావించిన వీరు.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే కొద్దిసేపటికి తేరుకున్న దయాచారి.. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. ఈ రోడ్డులోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. లోతుగా విచారణ చేశారు. ఈ క్రమంలోనే సొంత అన్నకుమారుడు, కుమార్తే హత్య చేయించటానికి సుపారీ ఇచ్చారనే విషయం వెలుగులోకి వచ్చింది.

Posted in Uncategorized

Latest Updates