అప్పుడు సైకిళ్లకు పంక్చర్లు.. ఇప్పుడు రూ.150 కోట్ల ఆస్తులు

రద్దీ రోడ్డు.. ఓ పక్కన చిన్న షాపు.. ఇక్కడ సైకిళ్లకు పంక్చర్లు వేయబడును.. సైకిళ్లు అద్దెకు ఇవ్వబడును.. గంట అద్దె 5 రూపాయలు, సైకిల్ పంక్చర్ వేస్తే 10 రూపాయలు.. వానొచ్చినా.. వరదొచ్చినా కూలిపోతుంది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వచ్చేది 200 రూపాయలు మాత్రమే.. పదేళ్ల క్రితం కందిశెట్టి రమేష్ జీవితం.. ఇప్పుడు రూ.150 కోట్లకు అధిపతి.. ఇతని దగ్గర అప్పులు తీసుకునే వారిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.. 2014 ఎన్నికల సమయంలో ఎన్నికల్లో పోటీ చేసిన ఐదుగురు రాజకీయ నాయకులకు వడ్డీకి డబ్బులు ఇచ్చాడు.. పదేళ్లలో 150 కోట్లకు ఎదిగిన కందిశెట్టి రమేష్ కష్టం, ఐడియాలపై ఎవరికీ డౌట్ లేకపోయినా.. ఆయన ఆదాయ పన్ను ఎగ్గొట్టటంతోనే అసలు సమస్య వచ్చింది. వివరాల్లోకి వెళితే..
తిరుపతిలోని పల్లివీధిలోని పూలతోటలో నివాసం రమేష్ ది. పదేళ్ల క్రితం సైకిళ్లకు పంక్చర్ల షాపు నిర్వహిస్తున్న సమయంలో పరిచయాలు ఏర్పడ్డాయి. నమ్మకస్తుడిగా పేరు రావటంతో చిట్స్ వ్యాపారం మొదలుపెట్టాడు. టైం టూ టైం చెల్లింపులు ఉండేవి. నమ్మకం మరింత పెరిగింది. చిట్స్ కూడా పెరిగాయి. ఇదే సమయంలో వచ్చిన డబ్బుని వడ్డీలకు ఇచ్చేవారు. సైకిల్ షాపు పోయింది.. చిట్స్ ఆఫీస్ వెలిసింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు చిట్స్ వేయటం మొదలుపెట్టాడు. వడ్డీకి ఇచ్చే అప్పు కూడా వేలు, లక్షలు దాటి కోట్ల వరకు వెళ్లింది. తన లావాదేవీల నిర్వహణ కోసం ఏకంగా ముగ్గురు ఆడిటర్లను నియమించుకున్నాడు. ఆ తర్వాత బంగారం వ్యాపారంలోకి దిగాడు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ ఆస్తి ఇప్పుడు రూ.150 కోట్లకి చేరింది. ఇటీవలే అధునాతమైన భవనం కూడా కట్టుకున్నాడు. ఆరా తీసిన ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. మూడు రోజులు సోదాలు. ఇప్పటి వరకు 8 కేజీల బంగారం సీజ్ చేశారు. 150 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్ కం ట్యాక్స్ కట్టాలని నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం రమేష్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.
సంపాదించటం కంటే.. దాన్ని దాచుకోవటం వల్ల వచ్చే ఇబ్బందులే ఎక్కువ అని మరోసారి ఆదాయపు పన్న శాఖ అధికారులు నిరూపించారు. ఈ వార్త చదువుతున్న వారి అందరికీ కూడా మహానటి సావిత్రి కథ గుర్తుకొస్తుంది కదా…

Posted in Uncategorized

Latest Updates