అప్మెల్ సింగరేణిదే…ఏపీకి వాటా లేదు

apmel
ఆప్మెల్ స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రానికి లేఖ రాసింది. సింగేణికి అనుబంధంగా ఉన్న ఆప్మెల్ ను ఏపీకి కేటాయించాలని షీలా బిడె కమిటీ ప్రతిపాదించడంపై తీవ్రంగా మండిపడింది. సింగరేణి సంస్థకు 81.54 శాతం వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకునేందుకు ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిపుణుల కమిటీ నివేదికను సాకుగా చూపి అత్యంత విలువైన ఆస్తులున్న ఆప్మెల్ ను తమ సొంతం చేసుకోవాలని ఏపీ సర్కార్  ప్రయత్నిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది. సింగరేణిలో 51:49 శాతం వాటాలున్న తెలంగాణ రాష్ట్రానికీ, కేంద్రానికీ నష్టం కలిగేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఆరోపించింది. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబాకు లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్ కే జోషి.

ఉమ్మడి రాష్ట్రంలో ఆప్మెల్ సంస్థను విజయవాడకు 25 కిలోమీటర్ల దూరంలోని కొండపల్లి దగ్గర 1976 ఏర్పాటు చేశారు. కొంతకాలానికి ఇది నష్టాల్లో కూరుకుపోయింది. ఆప్మెల్ ను  ఆదుకోవడానికి ఈ సంస్థకు చెందిన షేర్లను కొనుగోలు చేయాలని సింగరేణిని ఆదేశించింది అప్పటి సర్కార్. దీంతో 1994లో ఆప్మెల్ ను టేకోవర్ చేసింది సింగరేణి. అప్పటి నుంచి సింగరేణి అధికారులే చైర్మన్, డైరెక్టర్లుగా ఉంటూ వస్తున్నారు. అయితే  పునర్విభజన చట్టంలోని 9 వ షెడ్యూల్ ప్రకారం ఆప్మెల్ ను ఏపీకి కేటాయించాలని షీలా బిడె కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది తెలంగాణ సర్కార్.   ప్రస్తుతం లాభాల్లో నడుస్తూ 75 కోట్ల టర్నోవర్ కలిగిన ఆప్మెల్ లో 300 మంది పర్మినెంట్ సిబ్బంది, కార్మికులు పనిచేస్తున్నారు. ఆప్మెల్ లో సింగరేణికి 81. 54 శాతం వాటా ఉంది. ఏపీఐడీసీకి 5. 79 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 0.86 శాతం, పబ్లిక్ షేర్ హోల్డర్లకు 11. 81 శాతం వాటాలున్నాయి. షీలా బిడె సిఫార్సు పేరుతో ఆప్మెల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని కోరింది రాష్ట్రప్రభుత్వం. షెడ్యూల్ 9లో ఉన్న సంస్థల విషయంలో వివాదాలు, సందేహాలు ఉంటే కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరించాలని విభజన బిల్లు సెక్షన్ 71(ఎ)లో ఉంది.  దీని ప్రకారం చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

 

Posted in Uncategorized

Latest Updates