అప్రజాస్వామిక అనే మాటను రికార్డుల్లో నుంచి తొలగించాలి : జితేందర్‌ రెడ్డి

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి తెలంగాణపై అక్కసు వెల్లగక్కారు. శుక్రవారం (జూలై-20) అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మాట్లాడిన జయదేవ్ తన ప్రసంగం చివరలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అప్రజాస్వామికంగా, అశాస్త్రీయంగా విభజించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై TRS ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పూర్తి మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

పార్లమెంట్‌ లో ఆమోదం పొందిన బిల్లు అప్రజాస్వామికం ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజాస్వామికంగానే జరిగిందని తేల్చిచెప్పారు. అప్రజాస్వామిక అనే మాటను లోక్‌ సభ రికార్డుల్లో నుంచి తొలగించాలని స్పీకర్‌ కు జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రసంగం మొదట్లో కూడా జయదేవ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అప్రజాస్వామికంగా విభజించారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ కాదు అన్నారు. తెలుగు తల్లిని కాంగ్రెస్ రెండుగా చీల్చింది అని మోడీ అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ.. తల్లిని చంపి బిడ్డను బతికించిందని మోడీనే అన్నారని జయదేవ్ చెప్పారు. జయదేవ్ వ్యాఖ్యలపై TRS ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates