అబార్షన్లకు ఐర్లాండ్ డాక్టర్ల “నో”

అబార్షన్లపై ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఐర్లాండ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికోసం ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లు చట్టంగా మారడానికి ఇంకా పలు దశల్లో ఆమోదం పొందాల్సి ఉంది. ఇది అనైతికమంటూ ఐర్లాండ్ లో కొంతమంది వాదిస్తున్నారు. నిజానికి అబార్షన్లపై నిషేధం విధించడంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీంతో ప్రభుత్వం ఇటీవల రెఫరెండం నిర్వహించింది. మెజారిటీ ప్రజలు నిషేధం ఎత్తివేయడానికే మొగ్గు చూపడంతో రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ లో బిల్లు పెట్టింది. ఈ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని అక్కడి డాక్టర్లు, ఇతర సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని చట్టం తీసుకొస్తే నైతికత మాటేమిటని నిలదీస్తున్నారు. డాక్టర్లలో చాలా మంది అబార్షన్ను వ్యతిరేకిస్తున్నారని జనరల్ ప్రాక్టీషనర్ల అసోసియేషన్ చెబుతోంది. ఈ బిల్లులోని అంశాలను చూస్తే..డాక్టర్లతో బలవంతంగా అబార్షన్ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేస్తోందని వారి ప్రధాన ఆరోపణ. తాము మనస్సాక్షికి కట్టుబడి ఉంటామని, ఆ ప్రక్రియకు తమను దూరంగా ఉంచాలని కొంతమంది డాక్టర్లు కోరుతున్నారు.

అసలు బిల్లులో ఏముంది?
పిండం ఎదుగుదలలో తీవ్రమైన లోపాలు ఉన్నా, శారీరక, మానసిక వైకల్యాలతో పుట్టే ప్రమాదం ఉన్నా లేదా తల్లికి మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదం కలిగేలా ఉన్న సమయాలలో 12 వారాల లోపు గర్భాన్ని తొలగించవచ్చు. అబార్షన్ను ఉచితంగా చేయాలని ఈ బిల్లు సూచిస్తోంది.

ఏం జరుగుతోంది?
ఐర్లాండ్ రాజ్యాంగం ప్రకారం అబార్షన్ చట్టవిరుద్దం. అబార్షన్ అంటే ఓ ప్రాణాన్ని చంపేయడమేనని చట్టం చెబుతోంది. ఇది పాపమని కొందరు నమ్ముతుంటారు. వీరిలో డాక్టర్లు కూడా ఉన్నారు. ఈ పాపపు పనిలో పాల్గొనలేమని వారు చెబుతున్నారు. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లులో తన దగ్గరికి వచ్చిన పేషెంట్ కి అబార్షన్ చేయాలని కోరితే దానిని తిరస్కరరించే హక్కు డాక్టర్ కు ఉంటుంది. కానీ ఆ పేషెంట్ కి అబార్షన్ చేసే డాక్టర్ కి రిఫర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటోందని చెబుతోంది. ఈ బాధ్యత నుంచి మినహాయించాలని డాక్టర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే పార్లమెంట్ ఆమోదం తర్వాత సెనేట్ అనుమతి పొందాల్సి ఉంటుంది. బిల్లును పూర్తిగా తొలగించాలని తాము డిమాండ్ చేయడం లేదని, బలవంతంగా డాక్టర్లను అబార్షన్లకు ఒప్పించొద్దనేదే తమ డిమాండ్ అని డాక్టర్ల సంఘం చెబుతోంది. దీనికి ఐర్లాండ్ ప్రధాని అంగీకరించడం లేదు. మేలో నిర్వహించిన రిఫరెండంలో అబార్షన్లపై బ్యాన్ ఎత్తివేయాలని ప్రజలు పూర్తి మొజారిటీతో చెప్పారని అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates