అభ్యున్నతికి నిలయం..కౌఠ సర్కార్ బడి

SCHOOLప్రభుత్వ పాఠశాలలు అభ్యున్నతికి నిలయాలుగా మారుతున్నాయి. సర్కార్ బడుల్లో చదువుకున్న వారు ఎంతో గొప్పవాళ్లుగా తయారౌతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు.. ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ సర్కార్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులదే హవా. అటువంటి అటెండర్ నుంచి ఐఏఎస్ లను తయారు చేసిన కౌఠ(బి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలపై ప్రత్యేక కథనం.

సర్కార్ బడి అంటే మొహం చాటేసే రోజులు పోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విధ్యార్థులు ఉన్నతస్థానంలో ఉండటంతో ఈ స్కూల్స్ కి ప్రాధాన్యత పెరుగుతోంది. ఒక్క రిజల్ట్స్ లోనే కాదు.. స్వచ్ఛతలోనూ ప్రభుత్వ పాఠశాలలు ఎంతో ముందుంటున్నాయి. ఇలాంటి కేటాగిరిలోకి వస్తుంది ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ-బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక్కడ చదివిన వారు అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ వరకు ఉన్నారని పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. కౌఠ-బిలో చదివిన విద్యార్థుల్లో రెండువేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటంతో పాటు జిల్లాలో మొదటి ఐఏఎస్ అధికారిని అందించిన ఘనత ఈ పాఠశాలకే దక్కుతుంది.

ఇక్కడ చదువుకున్న రాజేందర్.. ఐఏఎస్ పాసై ప్రస్తుతం విత్తనాభివృద్ది సంస్థ జాతీయ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు.  మిగతా వారిలో చాలా మంది ఉపాధ్యాయులు, ఆర్టీసి, రెవెన్యూ, వ్యవసాయశాఖ, పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. 1957లో ఉర్దూ మీడియంలో ప్రారంభమైన కౌఠ-బి పాఠశాల.. ఆ తర్వాత ZPHSగా అప్డేట్ అయింది. దాతల సహాయంతో కౌఠ పాఠశాలకు నాలుగు ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఒక ఎకరంలో పాఠశాల భవనం, మరో మూడు ఎకరాల్లో మైదానం ఉంది. ఒకప్పుడు వెయ్యి మంది ఉన్న విద్యార్థుల సంఖ్య.. ప్రస్తుతం 250కి పడిపోయింది. దీనికి కారణం ప్రభుత్వ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభావం అంటున్నారు ఉపాధ్యాయులు.

బడిబాట ద్వారా మళ్లీ పాఠశాలకి పూర్వ వైభవం తీసుకొస్తామంటున్నారు. ఎంతో మందిని ఉన్నత స్థాయికి చేర్చిన పాఠశాలలో పనిచేయడం గర్వంగా ఉందంటున్నారు టీచర్లు. తాము చదువు చెప్తున్న పిల్లలు కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఇదే స్కూల్ లో చదివి.. ఇందులోనే ఉపాధ్యాయుడిగా పని చేయడం సంతోషంగా ఉందంటున్నారు  పూర్వ విద్యార్థులు. తమ గురువులు తమకిచ్చిన స్పూర్తితో.. ముందుకెళ్తూ.. తాము చదువు చెప్పే పిల్లలను కూడా అదేబాటలో నడిపిస్తామంటున్నారు. స్కూలులో చువుతున్న తమ పిల్లలకు  బంగారు భవిష్యత్ ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ఇక్కడ చదువుతో పాటు వాతావరణం కూడా బాగుంటుందంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఏటా అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పిల్లలకు నగదు బహుమతిని అందిస్తున్నారు పూర్వ విద్యార్థులు.

తాము చదివిన పాఠశాలకు ఏదో ఒకటి చేయాలంటున్నారు పూర్వ విద్యార్థులు. పాఠశాలలో చదివినవారు గొప్పవారు  కావడానికి గ్రామస్థుల సహకారం కూడా ఉంది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి.. స్కూల్ పనితీరుపై పర్యవేక్షిస్తుంటుంది.  ఊరిని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటున్నారు కౌఠ-బి గ్రామస్థులు. కౌఠ జిల్లా పరిషత్ పాఠశాలలో అన్ని వసతులు ఉండటంతో ఇకకడ చదువుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ల్యాబ్, కంప్యూటర్ విద్య, మధ్యాహ్న భోజనం, విశాలమైన తరగతి గదులు, ఆటలు ఆడుకోవడానికి విశాలమైన మైదానం ఉంటడం పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంది.

తెలుగుతో పాటు ఇంగ్లీషు మీడియంలోనూ పిల్లలు రాణిస్తున్నారు.  పిల్లలు కార్పొరేట్ స్కూల్స్ కి సమానంగా మార్కులు సంపాదిస్తున్నారు. అయితే… కౌఠ-బి పాఠశాలలోనూ కొన్ని సమస్యలున్నాయి. టీచింగ్-నాన్ టీచింగ్ కొరతతో పాటు స్కూల్ బిల్డింగ్ పాతబడింది. విశాలమైన ప్లే గ్రౌండ్ ఉన్నా కాంపౌండ్ లేక పిల్లల భద్రతకు లేకుండాపోయింది.  దీంతో ఇక్కడ చదివే పిల్లల సంఖ్య తగ్గిందని తెలుస్తోంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తే మళ్లీ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు టీచర్స్.

Posted in Uncategorized

Latest Updates