అమర ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి

MARRAGEతమ ప్రేమను పెద్దలు ఒప్పుకోక పోడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు…ప్రియుడు లేని జీవితం తనకు ఎందుకని ప్రియురాలు తనువు చాలించింది. దీంతో వారి ప్రేమకు గుర్తుగా కొడుకు కోసం గుడి నిర్మించడంతో పాటు ప్రతీ ఏటా సీతారాముల కల్యాణం రోజున వివాహం జరిపిస్తున్నారు తల్లిదండ్రులు. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో 14 ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగింది.

రామకోటి, సుక్కమ్మ దంపతుల కొడుకు బానోత్ రాంకోటి. ఇంటర్ చదువుతుండగా ఓ అమ్మయిని ప్రేమించాడు. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో రాంకోటి 2004లో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణంతో మానసికంగా కుంగిపోయిన ప్రేయసి కూడా ఏడాది తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. కొడుకు మరణాన్ని తట్టుకోలేక రాంకోటి తల్లి అనారోగ్యంతో మంచం పట్టింది. ఈ క్రమంలో తల్లికి ఓ రోజు రాంకోటి కలలో వచ్చి.. తనకు గుడి కట్టించి తనతోపాటు తన ప్రేయసి విగ్రహాలను ఏర్పాటు చేయాలని, ఏటా శ్రీరామ నవమి రోజు కల్యాణం జరిపించాలని వేడుకున్నాడట. కొడుకు కోరికతో తన ఇంటి ఆవరణలో గుడి కట్టించిన ఆ తల్లి.. వారి విగ్రహాలు ఏర్పాటు చేయించింది. ఏటా శ్రీరామ నవమి రోజున అమర ప్రేమికులకు ఘనంగా కల్యాణం జరిపిస్తున్నారు. సోమవారం(మార్చి-26) కూడా వారి విగ్రహాలకు తన కూతురు, అల్లుడి చేతుల మీదుగా కల్యాణం జరిపించింది సుక్కమ్మ. బంధువులు, గ్రామస్థులను పిలిచి భోజనాలు పెట్టారు.

Posted in Uncategorized

Latest Updates