అమిత్ షా బ్యాంకులోనే భారీగా పాత నోట్ల డిపాజిట్

amit shahపెద్ద నోట్ల రద్దు అధికార పార్టీ పెద్దలకు వరంగా మారిందా? బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు ఇది పరోక్షంగా ఉపకరించిందా? … ఓ సమాచార హక్కు కార్యకర్త ద్వారా బయటపడ్డ వివరాలు ఈ విషయం నిజమేనని  స్పష్టం చేస్తున్నాయి. దేశాన్ని కుదిపేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహానికి సంబంధించిన చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుజరాత్ లోని ఓ జిల్లా సహకార బ్యాంకు అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ బ్యాంకు రద్దయిన పాత నోట్లు భారీగా  డిపాజిట్ అయినట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆ బ్యాంకు లాభదాయకంగా మలుచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ లోని రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధిక మొత్తంలో రద్దయిన నోట్లను తీసుకున్న విషయం బయటపడింది.

ఒకటి అహ్మదాబాద్‌ డీసీసీబీ కాగా… రెండోది రాజ్‌కోట్‌ డీసీసీబీ. వీటిలో అహ్మదాబాద్‌ డీసీసీబీ డైరెక్టర్లలో అమిత్‌ షా కూడా ఉన్నారు. ముంబైకి చెందిన మనోరంజన్‌ రాయ్‌ అనే సమాచార హక్కు ఓ పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని తెలుసుకున్నారు. రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ 2016 నవంబరు 8న ఆకస్మిక ప్రకటన చేశారు. ప్రజలు తమ దగ్గరున్న ఆ నోట్లను డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. దీంతో పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరడం మొదలెట్టాయి. ఆ క్రమంలో అహ్మదాబాద్‌ డీసీసీబీకి కేవలం ఐదు రోజుల్లో అంటే నవంబరు 13 సాయంత్రానికి రూ 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమ అయ్యాయి. అటు రాజ్‌కోట్‌ DCCBలో రూ 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్‌ జరిగింది. రాజ్‌కోట్‌ నుంచే మోడీ 2001లో మొట్టమొదట గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడి డీసీసీబీకి చైర్మన్‌ అయిన జయేశ్‌భాయ్‌ విఠల్‌భాయ్‌ రదాదియా ప్రస్తుతం విజయ్‌ రూపానీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్‌ డీసీసీబీకి అమిత్‌ షా 2000లో ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు.

DCCBల ద్వారా నల్లధనాన్ని అనేకమంది వైట్‌ చేసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు జమ చేసే బ్యాంకుల జాబితా నుంచి డీసీసీబీలను నవంబరు 14న అంటే ఐదు రోజుల తర్వాత తొలగించింది. కానీ అప్పటికే వేల కోట్ల రూపాయల వరకు డిపాజిట్ అయ్యాయి.  డిపాజిట్ చేసిన నోట్లకు సంబంధించిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి విచారణా జరగలేదని ఆర్టీఐ కార్యకర్త తెలిపారు.

పాత నోట్ల డిపాజిట్ల విషయం వెలుగు చూడటంతో కాంగ్రెస్ పార్టీ…బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు  ఓవైపు నోట్ల రద్దుతో దేశ ప్రజల జీవితాలు అతకాకుతలం అవుతుండగా.. మరోవైపు అమిత్‌షా రికార్డులు బద్దలు కొట్టారని  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ శుక్రవారం(జూన్-22) ఓ ట్వీట్ చేశారు. అమిత్‌షా గారూ.. అభినందనలు అందుకోండి. మీరు సాధించిన విజయానికి సెల్యూట్ చేస్తున్నా.. అని రాహుల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates