అమెరికాలో రాక్షసబల్లులు కలకలం

రాక్షస బల్లులు అమెరిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బల్లిజాతి జీవులు అమెరికా దక్షిణాదిపై దురాక్రమణ చేస్తున్నాయి. ఇవి మనదేశంలోని ఉడుముల్ని పోలి ఉంటాయి. మూడు నుంచి నాలుగున్నర అడుగుల దాకా పెరుగుతాయి. అమెరికన్లు వీటిని అర్జెంటీనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుని పెంపుడు జంతువులుగా సాకుతారు. ముద్దు చేస్తారు. ఓపిక అయిపోతే బయట అడవిలో వదిలేస్తారు. దాంతోనే చిక్కు వచ్చిందని నేచర్ తాజా సంచికలో అచ్చయిన ఓ వ్యాసం హెచ్చరిస్తున్నది. ఇవి అడవిలోకి వెళ్లి దొరికిన చిన్నచిన్న ప్రాణులను, కీటకాలను, గుడ్లను స్వాహా చేస్తున్నాయి. ఇవి పండ్లను కూడా ఇష్టంగానే తింటాయి. అలాఅలా వీటి సంఖ్య క్రమంగా విస్తరిస్తున్నది. వీటిని టేగూ లిజార్డ్స్ అని పిలుస్తారు. ఇవి మరీ ఎక్కువైతే ఎలాంటి సమస్య వస్తుందో మనకు ఇప్పుడైతే తెలియదు అని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ లీ ఫిజెరాల్డ్ అన్నారు.

నేచర్‌లో వచ్చిన వ్యాసానికి ఈయన సహరచయిత. వీటి జనాభా ప్రస్తుతం ఎంతుందో ఎవరి దగ్గరా సరైన లెక్కలు లేవు. టేగూ బల్లుల దవడలు చాలా గట్టిగా ఉంటాయి. వాటి తోక కూడా పొడవుగా ఉంటుంది. అవసరమైతే దాన్ని కూడా ఆయుధంగా ఉపయోగించుకోగలదు. అమెరికా మొసళ్ల గుడ్లను, నేలమీద గూళ్లు కట్టుకునే పక్షుల గుడ్లను ఇవి ఇష్టంగా తింటాయి. ఇటీవల ఫ్లారిడా ఎవర్‌గ్లేడ్స్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా టేగూలు మెతకగానే ఉంటాయని, అప్పుడప్పుడూ మాత్రం తిక్కకు వస్తాయని వీటిని పెంచుకునే వారు అంటున్నారు.

తిరగబడితే వాటిని వెంటనే అదుపు చేయడం కొంచెం కష్టమని కూడా చెప్తున్నారు. ప్రైవేటు భూభాగాల్లో వీటిని లైసెన్సు లేకుండా మానవీయంగా వేటాడేందుకు ప్రభుత్వం అనుమతించింది. పబ్లిక్ భూభాగాల్లో మాత్రం వీటిని వలలు పన్ని పట్టుకుంటున్నారు. పెంచుకునేవారు వాటిని అడవుల్లో వదిలిపెట్టకపోవడం ఎందుకైనా మంచిదని అమెరికా అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో కొండచిలువలను పెంపుడు జంతువులుగా దిగుమతి చేసుకుని అనంతరకాలంలో వాటిని బయట వదిలివేయడం వల్ల పెద్ద సమస్యే ఎదురైంది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఇండియా నుంచి పాములను పట్టేవాళ్లను తీసుకువెళ్లారు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అంటే ఇదేమరి.

Posted in Uncategorized

Latest Updates