అమ్మకు బంగారు బోనం సమర్పించిన ఎంపీ కవిత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ కవిత వెయ్యి ఎనిమిది మంది మహిళలతో కలిసి ఆదయ్య నగర్ నుంచి ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు .అమ్మకు బోనం సమర్పించిన కవిత… తెలంగాణ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వచ్చాకే రాష్ట్ర పండుగలకు గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు బంగారు బోనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ నిర్వాహకులు.. బోనాలతో ర్యాలీగా బయలు దేరారు. పోతరాజుల వీరంగం, శివసత్తుల ఆటపాటలతో ఆలయం దగ్గర సందడిగా మారింది.

ర్యాలీలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు…డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ర్యాలీలో మంత్రి తలసాని చేసిన డ్యాన్సులు హైలైట్ గా నిలిచాయి. వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. దర్శనానికి ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు.

ఈ ఏడాది బోనాల జాతరను ఇంతకు ముందెన్నడూ జరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని మహంకాళికి సమర్పించేందుకు బంగారు బోనం సిద్ధం చేశారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారంతో ఈ బంగారు బోనాన్ని తయారు చేయించారు. 3 కేజీల 80 గ్రాముల బంగారాన్ని ఈ బోనం తయారీకి ఉపయోగించారు. రెండు బంగారు పాత్రలు… ఒక బంగారు ప్రమిదను బంగారు బోనం కోసం రూపొందించారు. ఈ పాత్రలపై మొత్తం 285 వజ్రాలను అలంకరిస్తారు.

Posted in Uncategorized

Latest Updates