అమ్మతోడు నిజంగా : ఆ పెట్రోల్ బంకుల్లో రూ.9 డిస్కొంట్

PETROLఆ పెట్రోల్ బంకుల్లో బంపరాఫర్.. పెట్రోల్ కొట్టించుకుంటే లీటర్ పై డిస్కొంట్స్.. అమ్మతోడు ఇది నిజం.. ఎక్కడెక్కడ అని.. మనం కూడా వెళ్లిపోదాం అని రెడీ అవుతున్నారా.. ఆగండి ఆగండీ.. ఇక్కడ కాదు మహారాష్ట్రలో. అన్ని పెట్రోల్ బంకుల్లో కాదు.. సెలక్ట్ చేసిన బంకుల్లో మాత్రమే. విషయం ఏంటంటే.. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ అధినేత రాజ్ థాక్రే పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన ఆఫర్ ఇది. అందులోనూ 50వ జన్మదినం. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులకు, కుర్రకారుకు పార్టీ తరపున పార్టీ ఈ విధంగా ఇచ్చింది. చరిత్రలో నిలిచిపోవాలంటే.. ప్రజలు అందరూ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని ఆ పార్టీ నేతలు ఆలోచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలపై చర్చ బాగా జరుగుతుంది. దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని భావించిన పార్టీ.. బైక్స్ ఉన్న కుర్రోళ్లు అందరికీ ఆ ఆఫర్ ప్రకటించేసింది.

మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పెట్రోల్ బంకులను సెలక్ట్ చేసింది. అందులో రూ.4 నుంచి రూ.9 వరకు డిస్కొంట్ ప్రకటించింది. కేవలం కుర్రోళ్లకు మాత్రమే. అందులోనూ బైక్స్ కు మాత్రమే. లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే గరిష్ఠంగా రూ.4 తగ్గింపు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ.84.26గా ఉంది. 4 రూపాయలు డిస్కొంట్ అనగానే పెద్ద ఎత్తున కుర్రోళ్లు.. బైక్స్ తో క్యూ కట్టేశారు. కొందరు అయితే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన ఆఫర్ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఆఫర్ తెలిసిన వెంటనే వేలాది మందికుర్రోళ్లు పెట్రోల్ బంకులకు టూ వీలర్స్ తో క్యూ కట్టారు. సెలక్ట్ చేసిన అన్ని పెట్రోల్ బంకులు రూ.4 డిస్కొంట్ ఇస్తే.. శివాడీ అసెంబ్లీ నియోజకవర్గంలోని పెట్రోల్ బంకుల్లో ఏకంగా తొమ్మిది రూపాయల వరకు డిస్కొంట్ ఇచ్చారు. మోడీకి ఈ పెట్రోల్ సెగ ఎలా ఉందో ఉద్యమం ద్వారా చూపిస్తాం అంటోంది ఆ పార్టీ. ఈ సందర్భంగా రాజ్ థాక్రేకు కుర్రకారు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Posted in Uncategorized

Latest Updates