అరుదైన ఆపరేషన్: 56 ఏళ్ల వ్యక్తికి..17ఏళ్ల యువకుడి గుండె

heart-surgeryతీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న 56 ఏళ్ల వ్యక్తికి.. 17 ఏళ్ల యువకుని గుండెను విజయవంతంగా అమర్చారు అపోలో ఆస్పత్రి డాక్టర్లు. శనివారం(ఫిబ్రవరి-10) ఈ గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయగా.. ప్రస్తుతం బాధితుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. డాక్టర్ల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై అతనికి చికిత్స అందిస్తున్నారు.

విజయవాడకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నాడు. కాళ్లు, చేతులు, ముఖంలో వాపు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. డాక్టర్లు పరీక్షలు చేయగా ‘డైలేటెడ్‌ కార్డియోమయోపతి’ అనే సమస్య ఉన్నట్లు తేలింది. అతడికి గుండె మార్పిడి తప్పనిసరి. గుండె మార్పిడి చేయాలంటే ఊపిరితిత్తులను కూడా మార్చాల్సిన పరిస్థితి. మొదట గుండెకు అసైన్డ్‌ డివైజ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి రూ.కోటి అవుతుంది. అంత ఖర్చును అతడు భరించలేడు.

గుండె మార్పిడి చేద్దామంటే వయసుకు సరిపడే గుండె లభించలేదు. చిన్న వయసు గుండె అమరిస్తే ఊపిరితిత్తులు కూడా మార్చాలి. దీంతో పాత గుండెను అలాగే ఉంచి, మరో గుండెను ఏర్పాటు చేసి ప్రాణాలు నిలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేకల నవీన్‌ కుమార్‌ అనే 17 ఏళ్ల యువకుడు బ్రెయిన్‌డెడ్‌ స్థితికి చేరుకున్నట్లు సమాచారం అందింది. అపోలో ఆస్పత్రిలోని డాక్టర్‌ గోపాలకృష్ణగోఖలే.. శనివారం(ఫిబ్రవరి-10) తెల్లవారుజామున కరీంనగర్‌కు వెళ్లి గుండెను ప్రత్యేక బాక్స్‌లో పెట్టుకుని అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాధితుడి గుండె దగ్గర ఎముకలు, కొన్ని నరాలను తొలగించి కొత్త గుండెకు స్థానం కల్పించారు. ఇలా పాత గుండెకు యువకుడి గుండెను అనుసంధానించి బాధితుడికి ఊపిరి పోశారు.

ఈ నెల 8న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లికి చెందిన మేకల నవీన్‌(17) బైక్‌పై వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించక శుక్రవారం రాత్రి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. దీంతో డాక్టర్లు అతడి గుండెను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 56 ఏళ్ల వ్యక్తికి అమర్చాలని నిర్ణయించుకున్నారు. గుండెను హైదరాబాద్‌కు చేర్చాలి. అందుకు డాక్టర్లు కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం కరీంనగర్‌ ట్రాఫిక్‌ సీఐ సీతారెడ్డి, ఇతర వైద్య నిపుణులతో 6:50 గంటలకు కరీంనగర్‌ నుంచి ప్రత్యేక వాహనంలో బయల్దేరి 8:50 గంటలకు హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి చేరుకుని డాక్టర్లకు గుండెను అందజేశారు.

పది మందితో కూడిన వైద్య బృందం ఐదున్నర గంటల పాటు శ్రమించి బాధితునికి విజయవంతంగా గుండెను అమర్చింది.

Posted in Uncategorized

Latest Updates