అవిశ్వాసంపై లోక్ సభలో చర్చ : కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న విపక్షాలు

మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తెలుగు దేశం పార్టీ… ఏపీకి అన్యాయంపై గొంతు వినిపించనుంది. గుజరాత్ కు ఒక న్యాయం… ఏపీకి మరో న్యాయమా ..అని కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రెవెన్యూ లోటు, వెనకబడిన అభివృద్ధి జిల్లాలకు నిధులు, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ లాంటి అంశాలపై కేంద్రం డబుల్ స్టాండ్ ని ఎండగట్టాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

విభజన చట్టంలోని అంశాలు, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్… రాజ్యసభలో ఇచ్చిన హామీలకు సంబంధించి… 18అంశాలను లోక్ సభలో ప్రస్తావించాలని సూచించారు. గురువారం(జూలై-19) రెండు సార్లు ఢిల్లీలో ఉన్న ఎంపీలతో మాట్లాడారు చంద్రబాబు. అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరుతూ… వివిధ పార్టీలకు చంద్రబాబు లేఖలు రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా …విభజన చట్టంలోని అంశాలు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం మోసపూరితంగా, అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిన్న టీడీపీ ఎంపీలు… చంద్రబాబు రాసిన లేఖ, విభజన సమస్యలు, ఏపీకి జరిగిన అన్యాయానికి సంబంధించిన పుస్తకాలను వివిధ పార్టీల నేతలకు అందించారు.

హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాళీ , తమిళ భాషల్లో పుస్తకాలను ప్రింట్ చేశారు. అవిశ్వాసంపై చర్చలో మాట్లాడేవారికి… సాయం చేసేందుకు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఢిల్లీలోనే ఉన్నారు . విభజన వ్యవహారాలు చూస్తున్న అధికారులను కూడా ఢిల్లీ పంపించారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా… తాను పార్లమెంట్ కు వెళ్లబోనన్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మెత్తబడ్డారు. జేసీతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. 5కోట్ల ప్రజల ప్రయోజనాలతో ముడిపడిన అంశం కావడంతో లోక్ సభకు వెళ్లాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడుకుందామని జేసీకి సర్ది చెప్పారు చంద్రబాబు. దీంతో ఢిల్లీ వెళ్తున్నట్టు జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates