అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరవని కమ్యూనిస్టులు

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుల ఎత్తులు పారలేదు. ఆ పార్టీలు కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాయి. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఒక్కొక్క సీటు సాధించాయి. 1999లో సీపీఐ ఒక్క సీటు కూడ గెలువకపోయినప్పటికి సీపీఎంకు మాత్రం ప్రాతినిధ్యం ఉంది. ఈసారి రెండు పార్టీలకు శాసనసభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితిని ఏర్పడింది.

కాంగ్రెస్‌ ప్రజాఫ్రంట్‌ కూటమిలో భాగంగా కేటాయించిన మూడు సీట్లలో సీపీఐ చేసి ఓటమి పాలైంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా కనీసం ఒక్కస్థానంలో కూడా గెలవకపోవడం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు కలసి పోటీచేసి ఉంటే కనీసం వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఉండేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హుస్నాబాద్‌ నుంచి పోటీచేసిన ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి 46,553 ఓట్లు సాధించి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌ చేతిలో 70,530 ఓట్లతేడాతో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ రెండో సీటు వైరా (ఎస్టీ)లో సీపీఐ అభ్యర్థి బానోతు విజయ 32,757 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బెల్లంపల్లి (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌  కేవలం 3,600 ఓట్లతో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు.

ఈ ఎన్నికల్లో సీపీఎం–బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) కలసి మొత్తం 107 సీట్లలో పోటీచేశాయి. సీపీఎం 26 స్థానాల్లో పోటీచేయగా, పార్టీ బలంగా ఉందని భావిస్తున్న భద్రాచలంలో మూడోస్థానానికి, మిర్యాలగూడలో నాలుగోస్థానానికి పరిమితమైంది. భద్రాచలం మినహా మిగతా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ప్రత్యామ్నాయ విధానాలు–సామాజికన్యాయం పేరిట ప్రస్తుత ఎన్నికల్లో సీట్లు కాకపోయినా గణనీయంగా ఓట్లు అయినా సాధించవచ్చుననే కోరిక కూడా సీపీఎం–బీఎల్‌ఎఫ్‌లకు నెరవేరలేదు. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి కె.శివకుమార్‌రెడ్డి 53,580 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచా రు. మధిరలో కోటా రాంబాబు 23,030 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఈచోట్ల మినహా మిగతా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. గోషామహల్‌ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థి చంద్రముఖిని బీఎల్‌ఎఫ్‌ బరిలో నిలిపినా కేవలం 120 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Posted in Uncategorized

Latest Updates