దళితులు, గిరిజనులు, పేదలు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసైన్డ్ భూములు(మార్పిడి నిషేధం) చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం మహమూద్ అలీ శాసనసభలో ప్రవేశపెట్టారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, పేదలు కొనుగోలు చేసిన 2.5 ఎకరాల వరకు ఆరుతడి, 5 ఎకరాల వరకు మెట్ట భూములను మాత్రమే క్రమబద్ధీకరిం చేందుకు ఈ బిల్లును తెచ్చామని తెలిపారు. ధనికులు కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల ను క్రమబద్ధీ కరించమని, HMDA పరిధిలోని అసెన్డ్ భూములను సైతం క్రమబద్ధీకరించబోమని తెలిపార. రాష్ట్రంలో 20 లక్షల 13 వేల 863 ఎకరాల అసైన్డ్ భూములుంటే అందులో 2 లక్షల 41 వేల 126 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయన్నారు. ఈ వివాదాలను పరిష్కరించడం కోసమే ఈ బిల్లును తెచ్చామన్నారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ.
ఆ భూములను కొనుగోలు చేసినవారికే అసైన్ చేయాలని ప్రభుత్వం భావించింది. 2017 డిసెంబర్ 31లోగా అసైన్డ్ భూమి కొనుగోలు చేసిన పేదరైతులకు ఈ చట్టం ప్రకారం రీఅసైన్ చేస్తారు. వాస్తవంగా 1977కు ముందు అసైన్డ్ అయిన భూముల క్రయవిక్రయాలు జరిగాయి. అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అమ్ముకున్న వారికే అప్పగించేలా 1997లో ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంపై అవగాహన లేని అసైన్డ్ రైతులు భూములను విక్రయించారు. మరోసారి 2007 జవనరి 29న అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన పేదరైతులకు తిరిగి రీఅసైన్ చేయాలని సవరణచట్టం తెచ్చారు.
ఈ మేరకు ఆనాటి వరకు జరిగిన క్రయవిక్రయాలను పరిశీలించి పేదలని గుర్తించినవారికి అసైన్‌చేశారు. అయితే అప్పటినుంచి కూడా క్రయవిక్రయాలు జరిగాయి. ఈ
క్రమంలో కొనుగోలు చేసిన వారికి ఆ భూములను రీ అసైన్ చేయడానికి 2017 డిసెంబర్ 31ని కటాఫ్‌గా నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇది 2018 మార్చి 5 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ సవరణ చట్టం ప్రకారం ఎవరైనా గిరిజన హక్కుల చట్టం ఉన్న ప్రాంతాల్లో గిరిజనులకు అసైన్డ్ చేసిన భూములను కొనుగోలు చేస్తే వర్తించదని స్పష్టంచేసింది. పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మ్డడి రాష్ట్రంలో గుర్తించిన నోటిఫైడ్ ఏరియాలలో ఈ చట్టం వర్తించదని తెలిపింది.