అసోం పౌరసత్వం : 40 లక్షల మందికి దక్కని చోటు

అసోంలోని భారత పౌరులకు సంబంధించి జాతీయ పౌర రిజిస్టర్‌ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 3.29కోట్ల మందికి 2.89 కోట్ల మందికి మాత్రమే పౌరసత్వం లభించింది. 40లక్షల మందికి పౌరసత్వం లభించలేదు. అసోంలో స్థానికులు – స్థానికేతరులను గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (NRC) ముసాయిదాను విడుదల చేసింది. ఇది కేవలం డ్రాఫ్ట్‌ మాత్రమేనని ఫైనల్ లిస్టు కాదని అధికారులు స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ NRC లిస్టును సోమవారం (జూలై-30) ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే NRC సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు అధికారులు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి వలసలు కొనసాగడంతోనే పౌరసత్వ జాబితాను రూపొందించాల్సి వచ్చిందన్నారు. ముసాయిదా జాబితాలో పౌరసత్వం దక్కని వలసదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదాలో లేని వారిని ఇప్పుడే విదేశీయులుగా పరిగణించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోం అని తెలిపింది. అదే విధంగా నిర్బంధ గృహాలకు తరలించే ఆలోచన కూడా లేదని వెల్లడించింది. భారతీయులుగా నిరూపించుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఆందోళనలు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు.

Posted in Uncategorized

Latest Updates