ఆగస్టు-2 నుంచే…. కొత్త గ్రామ పంచాయితీలు

కొత్త గ్రామ పంచాయతీలు ఆగస్టు-2 నుంచే ఉనికిలోకి రానుండటంతో…అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. క్లస్టర్ల రేషనలైజేషన్, పంచాయతీ సెక్రటరీలకు కేటాయించే బాధ్యతలు, కొత్త పంచాయతీల కోసం భవనాల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేయాల్సి ఉంటుందని జూపల్లి తెలిపారు. గురువారం(జులై-12) నాగర్‌ కర్నూల్ కలెక్టరేట్‌ లో కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలో, జెడ్పీసీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జూపల్లి….. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో… ఆ తర్వాత అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు జూపల్లి సూచించారు. ఉపాధిహామీ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాలన్నారు. కొత్తగా 4వేల 383 పంచాయతీలు ఏర్పడుతున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన14వ ఆర్థిక సంఘం నిధులను విభజించి కొత్త పంచాయతీలకు అప్పగించాలన్నారు. కొత్త పంచాయతీ పేరిట బ్యాంక్ ఖాతా, పీడీ ఖాతాను నియమితులైన ప్రత్యేకాధికారి తెరువాల్సి ఉంటుందని తెలిపారు. పాత గ్రామపంచాయతీల్లో ఉన్నట్లుగానే కొత్త పంచాయతీల్లోనూ అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు జూపల్లి సూచించారు. సచివాలయం నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates