ఆటోను ఢీ కొట్టిన టిప్పర్: ఆరుగురు మృతి

TIPPERతూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్ల కోట సమీపంలో (సోమవారం) అర్థరాత్రి ఆటోను టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు చనిపోగా.. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాకినాడ రూరల్ మండలం రామేశ్వరానికి చెందిన 15మంది పెద్దాపురం మండలం వడ్లమూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. కార్యక్రమం తర్వాత తిరుగు పయనమయ్యారు. ఆటో సాంబమూర్తి రిజర్వాయర్ దగ్గరకు వచ్చే సరికి అర్థరాత్రి అయ్యింది.

ఆటోను టిప్పర్ వచ్చి ఢీకొట్టడంతో లోపల ఉన్నవాళ్లంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో సాలాది నాగమణి(35), నొక్కు కమలమ్మ(35), పండు(3), ఇంద్రపాలెనికి చెందిన ఆటోడ్రైవర్‌ పెంకె రాజు(50) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు.

ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ ఆగకుండా వెళ్లిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలించారు. చివరికి సిరామిక్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Posted in Uncategorized

Latest Updates