ఆదర్శంగా నిలిచాడు : కొడుకుతో డిగ్రీ పూర్తి చేశాడు

చదువుకోవాల్సి వయసులో పేదరికం వెంటాడింది. చిన్నతనంలో చదవటానికి వీలుకాలేదు.  అయితే డిగ్రీ చదవాలన్నది తన చికకాల కోరిక. దీంతో కొడుకు డిగ్రీ చదివేరోజుల్లో తాను కూడా డిగ్రీ పూర్తిచేసి.. చదువుకు వయసుతో పనిలేదు ..పట్టుదల ఉంటే చాలని నిరూపించాడు ఓ ట్యాక్సీ డ్రైవర్. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

వివరాల్లోకెళితే.. ముంబైకి చెందిన మహ్మద్ ఫరూఖ్ షేక్ పదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆర్థిక సమస్యలతో ఉన్నత చదవులు చదవలేకపోయాడు. అయితే మహ్మద్ అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఈ క్రమంలో ఓ ప్రయివేటు బ్యాంకులో జూనియర్ క్లర్క్‌ గా ఉద్యోగం వచ్చింది. అయితే కొంతకాలానికి ఆ బ్యాంకును మూసివేశారు. వెంటనే పెళ్లి.. కుటుంబ భారం ఆయనపై పడటం.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న మహ్మద్.. ట్యాక్సీ డ్రైవర్‌ గా పని ప్రారంభించాడు. ఆయన కుమారుడు హజీం ఫరూఖ్ షేక్.. ఉన్నత విద్య స్థాయికి చేరుకున్నాడు. ముంబై యూనివర్సిటీలో హజీం డిగ్రీలో చేరాడు.

ఈ సమయంలో తనకు కూడా చదువుకోవాలనే ఆసక్తి మహ్మద్‌ కు కలిగింది. దీంతో ఆయన కూడా వైబీ చవాన్ యూనివర్సిటీలో దూరవిద్య డిగ్రీలో చేరాడు. ఇక మహ్మద్ రెగ్యులర్‌ గా క్లాసులకు వెళ్లి పాఠాలు నేర్చుకునేవాడు. సందేహాలు వచ్చినప్పుడు తన కుమారుడితో నివృత్తి చేసుకునేవాడు. ఇలా తండ్రీకుమారులిద్దరూ కలిసి.. ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మహ్మద్‌ కు 46 శాతం మార్కులు రాగా, హజీంకు 56 శాతం మార్కులు వచ్చాయి. లేటు వయసులోనూ తన చిరకాల కోరిక డిగ్రీ పట్టాను సొంతం చేసుకోవడంతో పట్టరాని సంతోషంగా ఉందని చెబుతున్నాడు ఈ ట్యాక్సీ డ్రైవర్.

 

 

Posted in Uncategorized

Latest Updates