ఆదిలాబాద్ ను వణికిస్తున్న చలి

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెథాయ్‌ తుపాన్‌ ప్రభావంతో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో  వీస్తున్న చలిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతుండడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత వారం, పది రోజుల క్రితం కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీలు నమోదు కాగా, రెండు, మూడు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెథాయ్ తుఫాన్‌ ప్రభావం ఉమ్మడి జిల్లా ప్రజలను వణికిస్తుంది.

ఈ తుఫాన్‌ వల్ల గత మూడు, నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. ఈనెల 13న 14.2 డిగ్రీల వరకు నమోదు కాగా, ఆదివారం తెల్లవారుజామున 6.4 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రత పడిపోయింది. చలి తీవ్రత పెరుగుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో యువకులు, వృద్ధులు చలిమంటలు కాగుతున్నారు. పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో పొగ మంచు కమ్ముకుంది. ఈ తుఫాన్‌ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులతో ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో బయటకురాలేని పరిస్థితి ఉంటుంది. రాత్రి 7 గంటలు దాటితే చలి పంజా విసురుతోంది. గ్రామాల్లో, అటవీ పరిసర ప్రాంతాల్లో చలి మరింత తీవ్రంగా ఉంటోంది.

Posted in Uncategorized

Latest Updates