ఆదుకున్న రాహుల్, మెరిసిన జడేజా

కాన్‌‌బెర్రా: మూడో వన్డేలో గెలిచిన టీమిండియా అదే జోరును తొలి టీ20 కొనసాగించలేకపోయింది.  టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్‌‌ను ఎంచుకుంది. శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ భారత్ తరఫున ఓపెనింగ్‌‌కు దిగారు. ఓపెనింగ్ జోడీ రెండంకెల స్కోరును బోర్డుపై చేర్చిందో లేదో స్టార్క్ వీరిని విడదీశాడు. ధవన్ (1)ని పెవిలియన్ చేర్చాడు. అనంతరం బ్యాటింగ్‌‌కు దిగిన కెప్టెన్ కోహ్లీ (9) వచ్చీ రాగానే ఫోర్ కొట్టి అలరించాడు. అయితే అతడ్ని స్వెప్సన్ కాట్ అండ్ బౌల్‌‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన శాంసన్ మంచి టచ్‌‌లో కనిపించాడు. ఒక ఫోర్, ఓ సిక్స్‌‌తో భారీ స్కోరు చేసేలా కనిపించినా.. హెన్రిక్స్ అతడ్ని ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మనీశ్ పాండే (2), హార్దిక్ పాండ్యా (16) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు.

ఒకవైపు కేఎల్ రాహుల్ ఫోర్లు కొడుతూ ఆకట్టుకుంటూంటే మరో ఎండ్‌‌లో అతడికి అండగా నిలిచేవారు కరువయ్యారు. దీంతో అటాకింగ్‌కు వెళ్లిన రాహుల్ సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖర్లో రవీంద్ర జడేజాకు వాషింగ్టన్ సుందర్ జతకలిశాడు. జడేజా (23 బంతుల్లో 44) 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో చెలరేగాడు. హేజల్‌‌వుడ్ వేసిన 19వ ఓవర్‌‌లో ఏకంగా 23 రన్స్ పిండుకున్నాడు. జడేజా తడాఖాతో భారత్ స్కోరు 150 దాటింది. చివరి ఓవర్లో మరో 11 పరుగులు చేరడంతో భారత్ 161 పరుగుల స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో హెన్రిక్స్ (3/22) మూడు వికెట్లతో రాణించాడు. స్టార్క్ (2/34) రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. ఆడమ్ జంపా (1/20), స్వెప్సన్ (1/21) చెరో వికెట్ దక్కించుకున్నారు.

Latest Updates