ఆధార్ తో డ్రైవింగ్‌ లైసెన్స్ లింక్

aadhar-drivingనకిలీ లైసెన్సులను ఏరివేసే లక్ష్యంతోనే డ్రైవింగ్‌ లైసెన్సులతో ఆధార్‌ సంఖ్యను అనుసంధానించే విషయాన్ని  పరిశీలిస్తోంది కేంద్రం. మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కేఎస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలో  రహదారి భద్రతపై న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనానికి ఈ అంశాన్ని తెలిపింది. ఈ అంశంపై గత ఏడాది నవంబర్‌ 28న రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శితో సమావేశమయ్యామనీ, నకిలీ లైసెన్సుల్ని తొలగించడంతోపాటు, పలు అంశాలు చర్చించినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. కొత్త సాఫ్ట్‌వేర్‌తో అన్ని రాష్ట్రాలు అనుసంధానమవుతాయనీ, దీనికి నకిలీ, దొంగ లైసెన్సులు రూపొందించడం సాధ్యం కాదని వెల్లడించింది ఆ నివేదిక. దీనికి సంబంధించి ఈనెల 22,23 తేదీల్లో అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు కమిటీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. రహదారి భద్రత నిధిని ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను కోరినట్లు కమిటీ తెలిపింది. అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రీకృత డేటాబేస్‌ను ఎన్‌ఐసీ రూపొందిస్తోందనీ, అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందనీ, డ్రైవర్లు చేసే అన్ని నేరాలు అందులో నమోదవుతాయని వివరించింది. పాదచారులకు సౌకర్యాల్ని కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచించినట్లు పేర్కొంది. సుప్రీం ధర్మాసనం ఈ అంశాన్ని ఏప్రిల్‌ 23కు వాయిదా వేసింది. ఆధార్‌కు రాజ్యాంగ బద్ధతను సవాలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Posted in Uncategorized

Latest Updates