ఆధార్ పై ట్రాయ్ చీఫ్ సవాల్ : గుట్టు విప్పి నెట్ లో పెట్టిన నెటిజన్లు

ఇంటర్నెట్ తో ఆటలొద్దు.. ముఖ్యంగా సోషల్ మీడియాతో పరాచకాలు అసలే వద్దంటున్నారు. అందులోనూ ఛాలెంజ్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే.. అతి సామాన్యులతోపాటు దేశముదుర్లు అందరూ ఉంటారు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలని గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఎప్పటికప్పుడు వార్నింగ్స్ ఇస్తూ వస్తుంది. వీటి అన్నింటినీ పట్టించుకోని మన ట్రాయ్ చీఫ్.. ఓ సవాల్ విసిరారు. ఆధార్ సురక్షితం కాదో నిరూపించండి అంటూ తన ఆధార్ నెంబర్ ను తన సొంత ట్విట్టర్ అకౌంటర్ ద్వారా వెల్లడించారు. కొద్దిసమయం మాత్రమే సైలెంట్ గా ఉన్న నెటిజన్లు, హ్యాకర్లు ఆ తర్వాత తమ ప్రతాపం చూపించారు.

ట్రాయ్ చీఫ్ ఆర్.ఎస్.శర్మ ట్విట్టర్ ఛాలెంజ్ స్వీకరించిన నెటిజన్లు.. అతని ఆధార్ నెంబర్ ఆధారంగా మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్, ఓటర్ ఐడీ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్, దాని నెట్ వర్క్ వివరాలు, ఫోన్ మోడల్, ఎయిర్ ఇండియా ఐడీని ఆయన రీ ట్విట్ చేశారు. అంతటి ఆగలేదు. శర్మ బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా వెల్లడించారు. ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని IFSC కోడ్ తో సహా వెల్లడించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓ అకౌంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయింట్ అకౌంట్ ఉందని బాంబ్ పేల్చారు. ఇక కొటాక్ మహీంద్రా, ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ సోషల్ మీడియాలో లీక్ చేశారు.

వీటికి ఆధారాలను చూపించటం మరో షాకింగ్. శర్మ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ లో అనివర్ అరవింద్ అనే హ్యాకర్.. ఒక రూపాయి డిపాజిట్ చేసి.. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఐడీ కూడా చూపించాడు. ఈ రూపాయితోపాటు ఎంతో కీలకమైన డీమాట్ అకౌంట్ వివరాలను కూడా బహిర్గతం చేశారు. గత మూడేళ్లలో SBI డెబిట్ కార్డు ద్వారా చేసిన లావాదేవీల స్టేట్ మెంట్ కాపీని కూడా లీక్ చేశారు. 2018 జూలై 2వ తేదీన లీలా ధర్ ఆర్గానిక్స్ అనే స్టోర్ నుంచి ఆర్గానిక్ గూడ్స్ కొనుగోలు చేసిన విషయాన్ని వెల్లడించి షాక్ కు గురి చేశారు.

ఫ్రెంచ్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ ఎల్డర్ సన్ అలర్ట్ చేశారు. శర్మ జీమెయిల్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యింది.. వెంటనే పాస్ వర్డ్ మార్చుకోండి అని సూచించారు. దీనికి శర్మ నిరాకరించారు. పాస్ వర్డ్ ఎందుకు మార్చుకోవాలని ప్రశ్నిస్తూనే.. ప్రస్తుతం లీక్ అయిన వివరాలు అన్నీ కూడా ఆధార్ వల్ల కాదని సమర్ధించుకున్నారు. హ్యాకర్స్ మాత్రం ఆధార్ సురక్షితం కాదని.. ఈ ఒక్క నెంబర్ తో జీవితాన్ని రోడ్డుపై పెట్టొచ్చని నిరూపించాం అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates