ఆన్ లైన్ అమ్మకాలపై కొత్త పాలసీ : భారీ డిస్కొంట్లకు చెల్లు

ఈ-కామర్స్.. గుండుసూది నుంచి విమానం వరకు ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. అంతే కాదు.. అప్పుడప్పుడు స్పెషల్ ఆఫర్స్ ఇస్తుంటాయి కంపెనీలు. 90శాతం డిస్కొంట్ కూడా ప్రకటిస్తాయి. డెలివరీ ఛార్జీలు ఫ్రీ అంటారు. అంటే వస్తువు ఫ్రీగా వచ్చినట్లే. కాకపోతే ఇప్పుడు కొనుగోలు చేసే వస్తువులకు ధర చెల్లిస్తే.. అందుకు సమానమైన ఓచర్లు ఇస్తారు. ప్రీమియం డే, పండుగల సమయంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు భారీ డిస్కొంట్స్ ప్రకటిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఇక నుంచి చెక్ పడనుంది. భారీ డిస్కొంట్లపై ఆంక్షలు విధించనుంది కేంద్రం. ఆన్ లైన్ అమ్మకాలపై కొత్త పాలసీలను తీసుకురాబోతున్నది. విధివిధానాలను కూడా రూపొందించింది.
వస్తువు ఏదైనా సరే.. ఎమ్మార్పీ రేటుకే అమ్మకాలని చెబుతుంది. డిస్కొంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎందుకు, ఎలా ఇస్తున్నారు అనేది స్పష్టం చేయాలి. ఇష్టమొచ్చినట్లు డిస్కొంట్లు ఇచ్చేసి వినియోగదారులను మోసం చేయటం నేరం అని చెబుతోంది కొత్త పాలసీ. కచ్చింగా ఎమ్మార్పీ ధరపైనా విక్రయాలు చేయాలని చెబుతోంది. దీనికితోడు ఆన్ లైన్ స్టోర్స్ లో విధిగా 100శాతం మేడ్ ఇన్ ఇండియా వస్తువులు ఉండాలని చెబుతోంది. ఇండియాలో విరివిగా లభ్యం అయ్యే వస్తువుల స్థానంలో విదేశీ వస్తువులను అమ్మరాదని ఆంక్షలు విధించనుంది. దీని వల్ల మేడిన్ ఇండియాకి ఊపు వస్తుందని.. స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తోంది కేంద్రం.
ప్రతి ఈ-కామర్స్ కంపెనీ ఇండియాలో లావాదేవీలు, కస్టమర్ల డేటాను లోకల్ సర్వర్లలోనే భద్రపరచాలనే నిబంధన తీసుకురాబోతున్నది. కంపెనీ నిర్వహణ విదేశాల్లో ఉన్నా.. స్థానిక కస్టమర్ డేటాను మాత్రం ఇండియాలోని సర్వర్లలోనే భద్రపరచాలని.. వాటిని బయటకు వెల్లడించటం నేరం అని చెబుతోంది. అదే విధంగా ఆన్ లైన్ – ఆఫ్ లైన్ లో ఒకే ధర ఉండాలని.. వ్యత్యాసం చూపించొద్దని కూడా కంపెనీలను ఆదేశించనుంది. మొబైల్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజరేటర్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు బయట షోరూమ్స్ లో ఎంత ధర అయితే నిర్ణయిస్తారో.. అదే ధర ఆన్ లైన్ లోనూ ఉండాలని నిబంధన తీసుకురాబోతున్నది. ఒకే కంపెనీలు.. ఒకే వస్తువు.. వివిధ ఫ్లాట్ ఫామ్స్ లో వివిధ ధరలు ఉండటాన్ని తప్పుబడుతోంది. ఆన్ లైన్ – ఆఫ్ లైన్ ఏదైనా సరే.. ఒకే ధరలో వినియోగదారుడికి లభించే విధంగా కొత్త పాలసీని తీసుకువస్తోంది కేంద్రం.

Posted in Uncategorized

Latest Updates