ఆన్ లైన్ ద్వారా ఆధార్ అడ్రస్ మార్పు

సంక్షేమ పథకాలతో పాటు.. బ్యాంకు లావాదేవీలకు ఆధార్ అనుసంధానం తప్పని సరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో అద్దెఇళ్లలో ఉండే వారు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆధార్ లో అడ్రస్ మార్చుకోవాలంటే వారు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇకపై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ అడ్రస్ ను ఈజీగా మార్చుకునే విధానాన్ని ప్రవేశ పెట్టాలని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) నిర్ణయించింది. దీని కోసం కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తోంది.

2019 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ సర్వీస్‌ అమల్లోకి వస్తుంది. సరైన అడ్రస్‌ ప్రూఫ్‌ ఉన్న వాళ్లు ఆ వివరాలను ఆధార్‌ సెంటర్లో సమర్పించి అడ్రస్ మార్చుకోవచ్చు. లేని వారు ఆ అడ్రస్‌కు పంపే ‘రహస్య పిన్‌’ను ఆధార్‌ కేంద్రంలో, SSUP ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పొందుపరిచి అడ్రస్ ను మార్చుకోవచ్చని UIDAI తెలిపింది. ఆధార్‌లో సరైన అడ్రస్‌ లేనందున వలస కార్మికులు, అద్దె ఇళ్లలో ఉండేవారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త సర్వీసు ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం జనవరి 1, 2019 నుంచి పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు.

ప్రస్తుతం అడ్రస్ మార్పిడి కోసం దరఖాస్తు నింపడంతో పాటు, ఆధార్‌ నిబంధనల్లో తెలిపిన 35 సర్టిఫికెట్లలో ఒకదాన్ని జత చేయాల్సి ఉంటుంది. వీటిలో పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌ పుస్తకం, ఓటర్‌ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, రిజిస్టరు చేసిన అద్దె అగ్రిమెంట్ పేపర్, మ్యారేజ్ సర్టిఫికెట్ వంటివి ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates