ఆపన్నహస్తం : ఆ వ్యాధిగ్రస్తులకు ఫ్రీ బస్సు పాస్, ఉచిత భోజనం

kidney-patientరాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్య సదుపాయాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిడ్నీ రోగులకు ఇప్పటికే ఉచిత డయాలసిస్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం..  వారికి బస్సు పాస్‌, ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించాలని నిర్ణయించింది. మంగళవారం (ఏప్రిల్-3) అనేక మంది డయాలసిస్‌ రోగులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి తమ పరిస్థితిని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వారానికి మూడుసార్లు డయాలసిస్‌ కేంద్రానికి రావాలంటే ఖర్చుతో కూడుకున్నదని, అందుకోసం ఉచిత బస్సు పాస్‌, భోజన సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది కిడ్నీ రోగులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇందులో చాలామంది వారానికి మూడు రోజలు డయాలసిస్‌ చేయించుకుంటున్నవారు ఉన్నారు.

నెలకు 12 రోజులు డయాలసిస్‌ కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న డయాలసిస్‌ కేంద్రాలకు వచ్చి చికిత్స తీసుకుని వెళ్లాలంటే ఒక రోజు సరిపోతుంది. వీరికి తోడుగా మరొకరు రావాల్సి ఉంటుంది. ఈ రోగుల్లో ఎక్కువ మంది వృద్ధులే. సంపాదించే పరిస్థితిలో లేని తాము నిత్యం డయాలసిస్‌ కేంద్రాలకు రావడానికి, అక్కడ తిండి తినడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. తమకు ఉచిత బస్సుపాస్‌, భోజన సౌకర్యం కల్పించాలని, అలాగే పింఛను ఇప్పించాలని, ఆరోగ్యశ్రీ, EHSల కింద డయాలసిస్‌ చేయించుకునే వారికి నెలకోసారి అడ్మిషన్‌ డిశ్చార్జి చేసే ప్రక్రియను తొలగించి, బార్‌కోడ్‌ కలిగిన ఐడీ కార్డు ఇవ్వాలని రోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 39 డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటికే 12 సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో 78 సెంటర్లున్నాయి.

Posted in Uncategorized

Latest Updates