ఆఫర్లతో బురిడి : పెరుగుతున్న మల్టిలెవల్ మార్కెటింగ్ మోసాలు

సమాజంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి. రకరకాల ఆఫర్లతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు అక్రమార్కులు. అట్రాక్ట్ అవుతున్న జనం సులభంగా మోసగాళ్ల ట్రాప్ లో పడిపోతున్నారు. చివరికి మోసపోయామని తెలుసుకుని గుండెలు బాదుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఆన్ లైన్ లో ఎట్రాక్ట్ చేసే ఆఫర్లు.

పెట్టుబడి అవసరంలేదంటూ పేపర్లలో ప్రకటనలు, లాటరీలు, చైన్ సిస్టమ్ స్కీమ్స్…. పేద, మధ్యతరగతి జనాలను చీటర్ల ఉచ్చులో పడేస్తున్నాయి. ఈ మల్టీ లెవల్ మోసాల్లో చిక్కి ఎందరో దోపిడి అవుతున్నారు. కరక్కాయల పొడి, గొలుసు కట్టు వ్యాపారం, ఉద్యోగాలంటూ డిపాజిట్ల వసూళ్ళు వీటికి తోడు లాటరీ ఫ్రాడ్స్, ఆన్ లైన్ లో దోపిడీలు… ఇవే కాకుండా హంగులు ఆర్భాటాలతో జనాన్ని నట్టేట ముంచుతున్న నయా మోసాలు ఇంకెన్నో. పక్కా స్కెచ్ వేసి కోట్లలో కొట్టేస్తున్నారు కేటుగాళ్ళు. మాయ మాటలతో మభ్యపెట్టి ఆస్తులను కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ లో కరక్కాయ, ఖమ్మంలో హ్యాపీ ఫ్యూచర్ కేసుతో పాటు సైబరాబాద్, రాచకొండలో కమిషనరేట్ల పరిధిలో మరో నాలుగు కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటిన్నింటిలో  20 కోట్లకు పైగా  దోచేసారు వైట్ కాలర్ నేరగాళ్ళు. ఇలాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్  వ్యవహారాల్లో మోసపోయినవారు… తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్లినా… ఫలితం లేకుండా పోతోంది. నొక్కేసిన సొమ్మును పోలీసులకు చిక్కకుండా మోసగాళ్లు  జాగ్రత్తపడుతున్నారు.

నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేసినా… సొమ్ము మాత్రం రికవర్ చేయలేకపోతున్నారు. దోచుకున్నదంతా దారి మళ్లించేసిన తర్వాతే అరెస్ట్ అవుతున్నారు మోసగాళ్లు. దీంతో ఇలాంటి నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు న్యాయం జరగడానికి ఏళ్లు పడుతోంది. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. కొన్ని గొలుసుకట్టు వ్యాపారాల్లో వైట్ కాలర్ క్రిమినల్స్ వందల కోట్లు దోచుకున్నారు. ఈ కేసుల్లో కోల్పోయిన సొమ్ము ఇంకా అందక ఏళ్ల తరబడి కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు బాధితులు.  ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల్లో కూడా సైబర్ దొంగలు దోచుకున్న సొమ్ము పూర్తిగా రికవరీ కావడం లేదు. ఈ సైబర్ నేరాల్లో ఎక్కువగా నైజీరియన్స్, సోమాలియన్స్ నిందితులుగా ఉండడంతో వాళ్ళ నుంచి డబ్బును వెనక్కి తీసుకోవడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి కేసుల్లో కేవలం 25 శాతం సొమ్మును మాత్రమే రికవరీ చేయగలుగుతున్నారు పోలీసులు. మల్టీ లెవెల్ మార్కెటింగ్, వైట్ కాలర్ నేరాలు తరచుగా జరుగుతున్నా… వాటిని పోలీసులు అరికట్టలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. నేరం జరిగాక… నేరస్థులను అరెస్ట్ చేయడం తప్ప… నేరాలు జరగకుండా ఆపలేకపోతున్నారు.

బాధితుల కంప్లైంట్ చేశాకే… స్పందిస్తున్న పోలీసులు వైట్ కాలర్ నేరాలకు పూర్తిగా చెక్ పెట్టలేకపోతున్నారు.  వీటి నియంత్రణ కోసం గతంలో రాష్ట్ర సీఐడీతో పాటు CCSలో 8 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు.  ఈ స్పెషల్ టీమ్స్… పేపర్ యాడ్స్ తో ప్రారంభమైన కరక్కాయ స్కామ్ ను పసిగట్టలేకపోయాయి. సాధారణంగా పేపర్స్, ఆన్ లైన్ యాడ్స్, మల్టీ లెవల్ మార్కెటింగ్ లాంటివాటిపై నిఘా పెట్టి డెకాయ్ ఆపరేషన్ తో అది నిజమా అబద్దమా అనేది గుర్తిస్తాయి ఈ స్పెషల్ టీమ్స్. ఆన్ లైన్ లో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్నఇలాంటి మోసాలకు చెక్ పెట్టడమే ఈ బృందాల పని. ఫ్రాడ్ ని గుర్తించి సూమోటోగా… కేసులు పెట్టి నేరస్తులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలకు అధికారముంది. కానీ అంతా అయ్యాక హడావుడి తప్ప… ఏనాడూ ముందుగా నేరాలను గుర్తించి అడ్డుకోవడం, నేరస్థులను అరెస్ట్ చేయడం జరగలేదు. మరోవైపు అత్యాశకు పోయి మోసపోవద్దని జనానికి సూచిస్తున్నారు పోలీసులు. మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates