ఆయుష్షు పెరుగుతుందని పాములతో పూజలు..చిర్రెత్తుకొచ్చిన నాగులు

SNAKEదేశంలో అతి మూఢ విశ్వాసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నాగు పాములకు పూజలు చేస్తే ఆయుష్షు పెరుగుతుందని పూజలు చేసి, చివరకు కటకటాల పాలయ్యాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన చెన్నైలో చోటు చేసుకోగా..ఇందుకు సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వివరాల్లోకెళితే.. చెన్నైలోని కడలూరు మంజా కుప్పంకు చెందిన సుందరేశన్‌ (45)అదే ఊరిలోని ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. 80 ఏళ్లు పూర్తిచేసుకున్న తన తండ్రికి శతాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్నాడు. నాగుపాములు పెట్టి పూజలు చేస్తే తల్లిదండ్రులకు పూర్ణాయుష్షు లభిస్తుందని కొందరు చెప్పిన మాటలను పాటించాడు. పాములు పట్టే వ్యక్తి ద్వారా రెండు నాగుపాములను తెప్పించాడు. బుట్టలో ఉన్న పాములను బైట పెట్టి పూజలు ప్రారంభించారు. కుమారుని పక్కనే కూర్చోవాల్సిన వృద్ధ తల్లిదండ్రులు దూరంగా కుర్చీ వేసుకుని జరుగుతున్న తంతును కళ్లప్పగించి చూడడం ప్రారంభించారు.

చుట్టూ జనం, వేదమంత్రాల ఘోషతో కంగారుపడుతున్న నాగుపాములు కుమారుడు సుందరేశన్‌ పైకి ఉరికే ప్రయత్నం చేయడం, పాములు పట్టేవాడు వాటినితనవైపునకు తిప్పుకోవడం పదే పదే సాగింది. చిర్రెత్తుకొచ్చిన నాగులు సుందరేశన్‌ పై బుసలు కొట్టగా భయపడిపోయాడు. ఈ కార్యక్రమానికి హాజరైన బంధువుల్లో కొందరు ఈ దృశ్యాలను సెల్‌ ఫోన్‌ లో వీడియోలు తీసి, వాట్సాప్‌ లో పోస్టు చేశారు. ఈ వీడియోలు, ఫోటోలు వైరలై.. అటవీ అధికారులకు చేరాయి. అటవీ అధికారులు అధికారులు విచారణకు ఆదేశించి పాములు పెట్టి పూజలు చేయడాన్ని నిర్ధారించుకున్నారు. పూజల పేరుతో పాములతో పరాచికాలాడిన సుందరేశన్‌ ను గురువారం (మే-17) అరెస్ట్‌ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. పరారైన పాములవాడి కోసం గాలిస్తున్నారు. మూఢ విశ్వాసం వల్ల మేళతాళాల మధ్య సాగిన శతాభిషేకం చివరకు విషాదంగా ముగిసింది.

Posted in Uncategorized

Latest Updates