ఆరోగ్య తెలంగాణే టార్గెట్ : యజ్ఞంలా ఇంటింటికీ కంటి పరీక్షలు

kcr healthతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటిపరీక్షలు నిర్వహించడానికి వైద్య ఆరోగ్యశాఖ సర్వసన్నద్ధం కావాలన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన కంటి పరీక్షలపై ఆదివారం (ఏప్రిల్ 8) ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఇంటింటికీ కంటి పరీక్షలు పేరిట ప్రతి పౌరుడికీ కంటి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని యజ్ఞంలా పూర్తిచేయాలని నిర్దేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని రంగంలోకి దిగాలని సూచించారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక, ఆచరణయోగ్యమైన వ్యూహం రూపొందించుకోవాలని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 900 వైద్యబృందాలు అందుబాటులో ఉన్నాయని.

ఇవి కాకుండా పొరుగు రాష్ర్టాల వైద్యుల సేవలను కూడా ఉపయోగించుకోవాలని ఆదేశించారు కేసీఆర్. గ్రామాల్లో, హైదరాబాద్‌లో, కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో కంటి పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన వ్యూహాలను రూపొందించుకోవాలని చెప్పారు. కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత.. అవసరమైన వారికి వెంటనే కండ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వాలి. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి కంటి వైద్యశాలలకు రిఫర్ చేయాలి. ప్రభుత్వ దవాఖానల్లోనే కాకుండా ప్రైవేటు వైద్యశాలల్లో కూడా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించాలని చెప్పారు సీఎం. గ్రామాల్లో, పట్టణాల్లో చాలామంది ప్రజలు కంటి జబ్బులతో బాధపడుతున్నారని.. కంటి పరీక్షలు చేయించుకునే వెసులుబాటు లేకపోవడం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో.. అవగాహన లేకపోవడం వల్లనో చికిత్సకు దూరంగా ఉంటున్నారన్నారు. కంటి జబ్బు ఉన్నా.. గుర్తించకుండా నెట్టుకొస్తున్నవారున్నారు. వారందరికీ ముందు అవగాహన కల్పించాలని తెలిపిన కేసీఆర్.. ప్రభుత్వం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates